నాకు ఇండస్ట్రీలో ఆఫర్లు రాక పోయినా పర్లేదు: హైపర్ ఆది
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది తన టాలెంటుతో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు. ఇటు టీవీ రంగంతో పాటు అటు సినిమా రంగంలో అద్భుతమైన భవిష్యత్ ఉన్నప్పటికీ అన్నింటినీ వదిలేసి పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా జనసేన పార్టీకి తరుపున ప్రచారం చేస్తున్నారు.
తాజాగా పాలకొల్లులో జనసేన యూత్ ఫోర్స్‌తో సమావేశం అయిన ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారని, ఆయనకు అందరూ సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు.

ఆయనకు ఎలక్షన్లయినా.. కలెక్షన్లయినా ఒకటే..
2009లో ఒక మంచి వ్యక్తి వచ్చారు. ముంచేశారు. ఈ సారి ఒక మొండి వ్యక్తి వచ్చారు... ఈ సారి ముంచడాలు ఉండవు.. తాడో పేడో తేల్చుకోవడమే. ఆయనకు ఎలక్షన్లయినా కలెక్షన్లయినా ఒకటే.. రికార్డులు మ్రోగిపోవాల్సిందే అంటూ తనదైన శైలిలో ప్రసంగించి పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరిచారు.

నాకు ఆఫపర్లు రాక పోయినా పర్లేదు
బేసిగ్గా ఇండస్ట్రీలో ఉండి పాలిటిక్స్ లో ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఆఫర్లు రావు అంటారు. నాకు ఆఫర్లు రాక పోతే నేను వెళ్లి నా జాబ్ చేసుకుంటా. మంచి వ్యక్తికి మనం సపోర్ట్ చేయకపోతే ఎప్పటికీ మనం ఇలానే ఉండిపోతామని హైపర్ ఆది వ్యాఖ్యానించారు.

మనస్సాక్షితో ఆలోచించండి
పవన్ కళ్యాణ్‌ను గెలిపించే విషయంలో అందరూ కులాలకు అతీతంగా గుండెమీద చేయేసుకుని ఆలోచించండి. ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు మంచి వ్యక్తో మీ మనస్సాక్షిగా నిర్ణయం తీసుకుని ఓటేయండని ఆది సూచించారు.

ప్రచారంలో బిజీ బిజీగా ఆది
ప్రస్తుతం హైపర్ ఆది తన పూర్తి సమయాన్ని జనసేన ప్రచారం కోసమే కేటాయించారు. ఏపీలోని వివిధ నియోజకవర్గాలు పర్యటిస్తూ ఆయా ప్రాంతాల వారు పవన్ కళ్యాణ్‌కు ఓటేసేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











