వారి జోలికి వెళ్లొద్దు.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 164 సీట్లను కైవసం చేసుకుని చరిత్రలో నిలిచిపోయే గెలుపును అందుకుంది కూటమి. కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచి కూటమి అభ్యర్ధులు ఎదురు లేకుండా ఆధిక్యంలో కొనసాగగా.. వైసీపీ అభ్యర్ధులు కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేశారు. హేమాహేమీలైన నేతలు సైతం మట్టికరిచారు. ఈ గ్రాండ్ విక్టరీతో కూటమి అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. నిన్నటి నుంచి బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ , డ్యాన్సులు చేస్తూ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
అన్నింటిలోకి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం ఆయన అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది. అభిమానుల పదేళ్ల నిరీక్షణ ఫలించి పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని ఘన విజయం సాధించారు. ఎన్నో అవమానాలను, ఛీత్కారాలను, హేళనలను పంటి బిగువున భరించి ఈ అపూర్వ విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. తనే కాదు తాను నిలబెట్టిన 21 మంది జనసేన అభ్యర్ధులను కూడా గెలిపించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించారు. ఇకపై జనసేనకు గాజు గ్లాస్ గుర్తు పర్మినెంట్‌గా ఉండిపోనుంది.

ఈ విజయాన్ని పవన్ అభిమానులు, సన్నిహితులు ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే భావోద్వేగానికి సైతం గురయ్యారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పిఠాపురంలోని పవన్ నివాసం నుంచి వీక్షించారు ఆయన కుటుంబ సభ్యులు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు ఆయన సోదరి విజయదుర్గలు కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో పవన్ విజయాన్ని చూసి విజయదుర్గ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి, పిఠాపురంలో పవన్ విజయం సాధించడం పట్ల జబర్దస్త్ కమెడియన్ హైపర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశారు. '' పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. వేలిపై సిరా గుర్తు చెరిగిపోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చాలా చాలా పెద్ధ థ్యాంక్యూ.. పది సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు . ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో , ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి , ఏ పదవి లేకపోయినా సంపాదించినదంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజున సరైన ఫలితం దక్కినందుకు .. ముఖ్యంగా 70 వేలకు పైగా మెజారిటీతో ఆయనను గెలిపించిన పిఠాపురం ప్రజలకి , అలాగే ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ సో మచ్. ''

'' ఈ గెలుపును పాజిటివ్ వేలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకుల్ని విమర్శించండి. అలాగే ఆడవాళ్లని కూడా చూడకుండా ట్రోల్ చేసిన సోషల్ మీడియా వాళ్లని విమర్శించండి. కానీ ఎవరైతే సగటు కార్యకర్త ఉంటాడో , వాళ్లని మాత్రం ఎవరూ ఏమీ అనకండి. ఎందుకంటే వాళ్లు కూడా మనలాంటి వాళ్లే. గెలిస్తే ఆనందపడతారు.. ఓడిపోతే బాధపడతారు కాబట్టి అలాంటి వాళ్ల జోలికి వెళ్లకుండా మన గెలుపుని హ్యాపీగా పాజిటివ్ వే లో చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ థ్యాంక్యూ. '' అంటూ హైపర్ ఆది ముగించారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కన్ఫర్మ్ కాగానే హైపర్ ఆది తన తోటి జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించారు. తన మార్క్ పంచ్‌లు, ప్రాసలతో వైసీపీపై విమర్శలు గుప్పించి ఓటర్లను చైతన్య పరిచారు ఆది. అందరి కష్టం ఫలించి పవన్ ఎమ్మెల్యేగా గెలవడంతో హైపర్ ఆది సంతోషం పట్టలేకుండా ఉన్నారు.


Click it and Unblock the Notifications











