‘జై బోలో సమైక్యాంధ్ర’ సినిమా ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతంలో జోరుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపు తేవడంలో భాగంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. 'జై బోలో సమైక్యాంధ్ర' పేరుతో తెరకెక్కుతున్న ఈచిత్రం తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
గతంలో చిరంజీవి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన శోభారాణితో పాటు... సినీ నటి, టీడీపీ నాయకురాలు కవిత ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. పూడి వెంకట్రావ్ నిర్మాత. రామానశివ కుమార్, కారి గోవిందరాజు ఈ చిత్రానికి సహనిర్మాతలు.

లక్ష్మణ్ పూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీప్లే అందించనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఎందుకు జరుగుతోంది, ఏ విధంగా జరుగుతోంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాలను ఫోకస్ చేస్తూ రాష్ట్రం ఒక్కటిగా ఉండాలనే సందేశంతో ఈచిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్.శంకర్ దర్శకత్వంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 'జై బోలో తెలంగాణ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో చిత్రంలో జగపతి బాబు కూడా నటించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. తాజాగా తెరకెక్కుతున్న 'జై బోలో సమైక్యాంధ్ర' సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు? అసలు నటించడానికి జగపతి బాబు స్థాయి హీరో ఎవరైనా ముందుకు వస్తారా? అనేది సమైక్యవాదుల్లో చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











