‘రాంబాబు’ సినిమా లగడపాటి సృష్టే!
హైదరాబాద్: 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా పై వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు లేదు. ఈ చిత్రం పూర్తిగా ఎంపీ లగడపాటి సృష్టేనని జై తెలంగాణ ఫిల్మ్ ఐకాస ఛైర్మెన్ పంజాల జైహింద్‌గౌడ్ ఆరోపించారు. లగడపాటి ఇచ్చిన స్క్రిప్టునే పూరి జగన్నాథ్ పేరుతో చిత్రంగా రూపొందించారన్నారు. ఈ చిత్ర టైటిల్‌ను 'దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఎంపీ లగడపాటి' అని పెడితే బాగుండేదని ఎద్దేవాచేశారు. ఈ సినిమాతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నగరంలోని సినీ పరిశ్రమనే పెద్ద అడ్డంకిగా మారిందన్న విషయం స్పష్టమైందన్నారు.
అలాగే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర సినిమాలకు పోతున్నాయన్నారు. ఇందులో తెలంగాణ కళాకారులకు కనీసం 2శాతం కూడా దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని జై తెలంగాణ ఫిల్మ్ ఐకాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైహింద్‌గౌడ్‌తో పాటు పలువురు మాట్లాడారు. సినీ పరిశ్రమ డబ్బుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ లగడపాటితో పాటు మరి కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇక తెలంగాణ దర్శకులు, హీరోలుగా నటించిన 'సర్ధార్ పాపన్న' సినిమాకు అవార్డు రాకుండా ఆంధ్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు అడ్డుకుందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పైడి జైరాజ్ రాష్ట్రంలో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నా.. ఆయన ఫొటోను రాష్ట్ర ఫిల్మ్ పరిశ్రమ కార్యాలయంలో నేటికి పెట్టకపోవడంలోనే తెలంగాణ నటులు, కళాకారుల పట్ల ఆంధ్ర చిత్ర పరిశ్రమ చూపిస్తున్న వివక్షతకు అద్దం పడుతుందని వివరించారు.
మరో ప్రక్క తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మేం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా తీయలేదని, ఊహించని ఈ పరిణామానికి చింతిస్తున్నామని చిత్రం నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా సమస్యాత్మక సన్నివేశాలను గుర్తించి, తొలగించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు, ''నాయకుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని 12 కట్స్ ఇవ్వడం జరిగింది. నేటి నుంచి ఆ సీన్స్ వుండవు. అలాగే ప్రేక్షకులకు క్లారిటీ మిస్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక పంపిణీదారుడిగా ఆర్థికంగా నష్టం జరిగినా, దానికి నేను బద్ధుడను'' దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











