సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు : నాగబాబు సంచలన వ్యాఖ్యలు
తన కృషి , పట్టుదలతో సామాన్య స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిత్రసీమను దశాబ్ధాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు. పరిశ్రమలో తను నిలదొక్కుకున్న తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, నిహారిక, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రాహుల్ దేవ్, అల్లు శిరీష్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. అల్లు అర్జున్ ఓ సందర్భంలో .. చిరంజీవి ముళ్లు, రాళ్లను ఏరుకుంటూ తమకోసం హైవే వేస్తే.. తాము ఆ రూట్‌లో బెంజ్‌కారు నడుపుకుంటూ వెళ్తున్నామన్నారు.
దాదాపు డజను మంది హీరోలున్న మెగా కుటుంబం పరిశ్రమను శాసిస్తోంది. మెగా హీరోల పేరుతో ప్రతియేటా వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అయితే మెగా కుటుంబంపై కొందరు విమర్శలు , ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మెగా కుటుంబం జోలికి వెళ్తే.. వారికి ఇండస్ట్రీలోనే మనుగడ ఉండదని ఆరోపిస్తుంటారు. సినీనటి, మాజీ మంత్రి రోజా అయితే నేరుగా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటారు.

ఆ ఫ్యామిలీ అంటే పలువురు నటులకు ఎలాంటి ప్రేమ లేదని, వాళ్లంటే భయమని ఆరోపించారు. వారు చెప్పినట్లు వినకుంటే తమకు సినీ అవకాశాలు తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారని రోజా విమర్శించారు. రోజా ఒక్కరే కాదు.. చిరంజీవి కుటుంబంపై ఎంతో మంది ఆరోపణలు చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉండేవారు ఎన్నోసార్లు దీనిపై క్లారిటీ ఇచ్చినా దీనికి మాత్రం చెక్ పడటం లేదు.
ఇదిలాఉండగా.. మెగా డాటర్ నిహారిక కమిటీ కుర్రోళ్లకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 9న కమిటీ కుర్రోళ్లు రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య చాలా మంది మెగా ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ మరొకరు తప్పించి ఇండస్ట్రీలో ఉండరరు అంటూ వెధవలు పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు.. మా నాన్న, తాతల సామ్రాజ్యం కాదు.. మెగా, నందమూరి , అక్కినేని కుటుంబాలదే కాదు.. కష్టపడే ప్రతి ఒక్కరిదీ, ఇది అందరిదీ అని ఆయన తేల్చిచెప్పారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడవి శేష్ వంటి వాళ్లు తమ కష్టంతో ఎదిగారని.. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయని, నిరూపించుకోవడానికి ఎన్నో వేదికలు ఉన్నాయని నాగబాబు పేర్కొన్నారు. కథల ఎంపికలో అడవి శేష్, వరుణ్ తేజ్ నచ్చుతున్నారని.. విరూపక్ష నుంచి సాయితేజ్ కూడా మారాడని .. కొడితే ఎగిరి ఎక్కడో పడే కంటెంట్ కాకుండా మంచి కథల మీద నేటితరం ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











