AP Elections Counting: రెచ్చగొడితే అదే చేయండి.. నాగబాబు వీడియోతో సెన్సేషనల్ కామెంట్స్
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరికొద్దిగంటల్లో విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయోనన్న టెన్షన్ పార్టీల అధినేతలు, అభ్యర్ధులు, కార్యకర్తల్లో ఉంది. క్షణక్షణానికి బీపీ పెరిగిపోతూ, నరాలు చిట్టిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం తలోరకంగా వచ్చాయి. వైసీపీ గెలుస్తుందని కొందరు, టీడీపీ కూటమి గెలుస్తుందని ఇంకొన్ని సంస్థలు ప్రకటించాయి . ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో టెన్షన్ మరింత పెరిగితే తప్పించి తగ్గలేదు.
ఎవరికి వారు తమదే అధికారమని చెబుతున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు. మరోవైపు.. పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, భారీగా బలగాలను మోహరించారు. రాష్ట్రమంతా రెడ్ జోన్‌గా ప్రకటించి.. 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లోకి చేస్తున్నారు. బయటి వ్యక్తులను , రౌడీషీటర్లను కౌంటింగ్ ముగిసే వరకు ఎట్టిపరిస్ధితుల్లోనూ నియోజకవర్గాల్లోకి అనుమతించడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, ఓడిపోతామని వైసీపీ నేతలకు కూడా తెలుసునని చురకలంటించారు. దీంతో ఓటమి తట్టుకోలేక భావోద్వేగానికి గురై దాడులు నిర్వహించే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని నాగబాబు హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సంయమనం కోల్పోవద్దని కూటమి కార్యకర్తలకు ఆయన సూచించారు. వైసీపీ కార్యకర్తల కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించ వద్దని నాగబాబు అన్నారు. కానీ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
పార్టీ ఏదైనా కార్యకర్తల క్షేమాన్ని కోరాలి గానీ వారిని విద్వేషాలకు, విధ్వంసాలకు పాల్పడే విధంగా రెచ్చగొట్టకూడదన్నారు. వైసీపీ కార్యకర్తలైనా, ఇతర ఏ పార్టీకి చెందిన వారైనా తమకున్న బాధ్యతలను గుర్తెరగాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారని.. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోనూ కూటమిదే విజయమని తేలిందని నాగబాబు గుర్తుచేశారు. కౌంటింగ్ రోజున ఏజెంట్లుగా హాజరయ్యేవారు తమ పార్టీ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో, ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ గెలుపు ఓటములను నిర్దారించుకోవాలని ఆయన సూచించారు.
ఫలితాలపై ఏమైనా అనుమానాలుంటే అక్కడే ఉన్న సంబంధిత ఆర్వోకు ఫిర్యాదు చేయాలని నాగబాబు తెలిపారు. ఘర్షణలకు దిగడం వల్ల కార్యకర్తలు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయి తప్పించి.. మిమ్మల్ని రెచ్చగొట్టేవారెవ్వరూ రారని ఆయన హితవు పలికారు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు , ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమీషన్ అధికారులు జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని జనసేన సహా టీడీపీ, వైసీపీ, బీజేపీ కార్యకర్తలను నాగబాబు కోరారు. ఫలితం ఎలా వచ్చినా హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications











