సిట్టిబాబు లుంగీ ఎత్తి స్టెప్పేస్తే నా సామిరంగా..: జానీ ఇరగదీస్తున్నాడుగా!..
ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాత బన్నీ, రాంచరణ్‌లు మళ్లీ ఆ స్థాయి డ్యాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే.. కచ్చితంగా ఫ్యాన్స్ మాస్ మసాలా స్టెప్పులు కోరుకుంటారు. చెర్రీ, బన్నీలు కూడా అభిమానులను నిరాశపరచకుండా ఒక్క పాటైనా తమ స్టెప్పులతో కుమ్మేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు 'సిట్టిబాబు' కూడా తెగ హడావుడి చేసేస్తున్నాడు..
Recommended Video

సిట్టిబాబు స్టెప్పులు:
'రంగస్థలం' సినిమాలో చెర్రీ సిట్టిబాబు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఊరమాస్ సిట్టిబాబు కోసం అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడట కొరియోగ్రాఫర్ జానీ. రంగస్థలం కోసం కంపోజ్ చేస్తున్న స్టెప్పులకు సంబంధించి కొన్ని ఫోటోలను జానీ మాస్టర్ తాజాగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఒక ఊపు ఊపేలా..:
పీరియాడికల్ చిత్రంగా పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రొటీన్ ఫార్మాట్ నుంచి కాస్త విభిన్నంగా తెరకెక్కుతున్నప్పటికీ.. చెర్రీ నుంచి కోరుకునే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌కు దర్శకుడు సుకుమార్ పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అభిమానులను ఒక ఊపు ఊపేలా మాస్ సాంగ్ కంపోజ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

గుబురు గడ్డం.. లుంగీతో:
ముఠా మేస్త్రీ లాంటి సినిమాల్లో లుంగీ పైకెత్తి చిరంజీవి వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఎంతలా ఊగిపోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చెర్రీ కూడా.. అలా లుంగీ పైకెత్తి ఆడి పాడబోతున్నాడు. జానీ మాస్టర్ కంపోజింగ్ చూస్తుంటే.. గుబురు గడ్డం.. లుంగీ గెటప్‌లో చెర్రీ మాస్‌కు పూనకమొచ్చే స్టెప్పులేసినట్టే కనిపిస్తోంది.

క్రేజీ సాంగ్..:
సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాల్సిందే. ఆర్యలో 'అ అంటే అమలాపురం'.. ఆర్య-2లో 'రింగరింగా..' 100 % లవ్‌లో 'డియ్యాలో డియ్యాలో..' వంటి సాంగ్స్ జనానికి ఎంతలా రీచ్ అయ్యాయో తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు రంగస్థలంలోనూ మంచి మాస్ మసాలా పాటను పెట్టారట సుక్కు. ఈ సాంగ్ తెరపై బ్లాస్ట్ అవడం పక్కా అంటున్నారట.

రంగస్థలం కథ ఇదేనా?..:
రంగస్థలం ఇద్దరు అన్మదమ్ముల భావోద్వేగాలతో కూడుకున్న కథ అనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ్ముడిని హత్య చేసినవాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పాత్రలో రాంచరణ్ కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇదంతా ఊహాగానానికే పరిమితమా?.. సుకుమార్ ఇదే చూపించబోతున్నారా అన్నది సినిమా విడుదలైతే కానీ చెప్పలేం. మార్చి చివరి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











