జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఆ ముగ్గురు సినీ ప్రముఖులు.. ఎవరికి వారే భారీ పైరవీలు! బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్‌లో
తెలుగు సినీ పరిశ్రమపై పట్టు సాధించేందుకు బీజేపీ తెలంగాణ నేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సమైక్య ఆంధ్రలో గానీ, తెలంగాణలో గానీ ఇప్పటి వరకు పెద్దగా సినీ తారలపై ఆధారపడని బీజేపీ ఇక ముందు తారల తళుకుబెళుకులతో పార్టీని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు భారీ ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. ఈ క్రమంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కీలకస్థానంపై ముగ్గురు సినీ ప్రముఖులు కన్నేసినట్టు రాజకీయ, సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఏడాదికి ముందుగానే..
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల కసరత్తు ఏడాది ముందుగానే ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో బలమైన టీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనే గెలుపు గుర్రాలపై నజర్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఆర్థికంగా, ప్రజాదరణ ఉన్న నేతలతోపాటు గ్లామర్‌ను కూడా దట్టించేందుకు నేతలు సన్నద్దం అవుతున్నారు.

అధికారమే లక్ష్యంగా సినీ తారలతో..
తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థుల వేటను కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే పలువురు సినీ తారలతో టచ్‌లో ఉన్నారు. ఎన్టీఆర్, నితిన్ లాంటి తారలతో బహిరంగంగా, మరికొందరు స్టార్ హీరోలతో అంతర్గతం చర్చలు జరుపుతున్నారు. అయితే కొన్ని డిమాండ్లు, హమీలపై క్లారిటీ లేకపోవడంతో పార్టీలో చేరడంపై మలగుల్లాలు పడుతున్నారు.

జీవితా రాజశేఖర్ క్రియాశీలకంగా..
అయితే ఇప్పటికే పలు పార్టీలో తమ రాజకీయ అదృష్టాన్నీ పరిక్షించుకొన్న జీవితా రాజశేఖర్ ప్రస్తుతం బీజేపీలో చురకుగా పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై భారీ ఆరోపణలు చేసి పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు.

జూబ్లీ హిల్స్ సీటుపై కన్నేసిన సినీ తారలు
అయితే టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ తారలు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించే సీట్లలో ఒకటైన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. తమకు జూబ్లీ హిల్స్ స్థానం నుంచి టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌తో బీజేపీని కొందరు ఇప్పటికే సంప్రదించారని, అయితే అధిష్టానం ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం నిర్ణయానికే వదిలి వేసిందని సమాచారం.

రేసులో ఆ ముగ్గురు
ఇదిలా ఉండగా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో జీవితా రాజశేఖర్, ది కశ్మీర్ ఫైల్స్, కార్తీకేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్, అలాగే హీరో నితిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అయితే ఈ సినీ తారలు ఇప్పటికే ఎవరి శక్తి మేరకు వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జూబ్లీ హిల్స్‌పై బిజినెస్ మ్యాన్ నజర్
ఇదిలా ఉండగా, జూబ్లీ హిల్స్ టికెట్ కోసం వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కూడా ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ధనబలం, కండబలం, ప్రజాబలం ఉన్ననేతలు కూడా బీజేపీ అగ్రనేతలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి వారిలో బిజినెస్ మ్యాన్ ఆలపాటి లక్ష్మీనారాయణ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే అగ్రనేతలతో భేటి అయి.. టికెట్ ఇవ్వాలని అభ్యర్థించినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











