పోలీస్ స్టేషన్లో జీవితా రాజశేఖర్.. దాడి చేశారంటూ ఫిర్యాదు, ఏం జరిగిందంటే?
టాలీవుడ్ నటుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నేడు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. సంతోషంగా వేడుకల్లో మునిగి తేలాల్సిన రోజు ఆయన భార్య జీవితా పోలీస్ స్టేషన్ మెట్లక్కడం, ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది.
కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి తమ కుటుంబంపై దాడి చేశారని ఆరోపిస్తూ జీవిత రాజశేఖర్ బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయాన్ని సోమవారం సంప్రదించారు. వెంటనే అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను కోరినట్లు సమాచారం.

అసలు ఏం జరిగింది?
రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌పై కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు దిగారని, దాడి చేశారని ఫిర్యాదు చేశారు. డైమండ్ షోరూంలో కారు పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరుగడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.

సాక్షాలతో సహా పోలీసులకు ఫిర్యాదు
కౌశిక్ బెదిరింపులకు పాల్పడి, దాడి చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయని, ఈ వీడియో సాక్షంతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జీవిత రాజశేఖర్ తెలిపారు. రోడ్ నెం.45లో ఉన్న గుణశేఖర్ డైమండ్ షోరూం వద్ద ఈ గొడవ చోటు చేసుకుంది.

బూతులు తిడుతూ దాడి చేశాడు: జీవిత
ఈ విషయమై జీవిత మాట్లాడుతూ... రాజశేఖర్ బ్రదర్ గుణశేఖర్‌కు రోడ్ నెం.45లో గుణడైమండ్స్ అని డైమండ్ షోరూం ఉంది. ఆ షోరూంలో ఒక అజ్ఞాత వ్యక్తి శనివారం సాయంత్రం కారు పార్క్ చేసి వెళ్లిపోయారు. ఆయన బండి తీయడానికి వచ్చినపుడు గుణశేఖర్ ఇక్కడ ఎందుకు పార్క్ చేశారని ప్రశ్నించారు. దీంతో అతడు బూతులు తిడుతూ దాడి చేశాడు. కాళ్లతో తన్ని పీక పిసికి కొట్టాడు... అని జీవిత తెలిపారు.

కౌశిక్ రెడ్డి ఎవరో తెలిసింది
దాడి చేసిన వ్యక్తి ఎవరు? అని ఆరా తీస్తే అతడి పేరు కౌశిక్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిసింది. ఇటీవల హుజారాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశారట. మా వద్ద ఉన్న సీసీ టీవీ సాక్షాలతో కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చామని జీవిత తెలిపారు.


Click it and Unblock the Notifications











