అప్పుడు అధ:పాతాళానికి వెళ్లిపోయాం: జీవిత ఎమోషనల్ స్పీచ్
డా.రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం కల్కి. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతున్న మూవీ టీజర్ ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ... 'గరుడ వేగ' సినిమాకు ముందు మేము ఎక్కడో అధ:పాతాళానికి వెళ్లిపోయాం. రెగ్యులర్ స్ట్రీమ్‌లోకి తిరిగి రాగలుగుతామా? అని ఎన్నో భయాలు ఉండేవి. ఆ భయాన్ని మాటల్లో చెప్పలేం. డబ్బులు సంపాదించవచ్చు, కోట్ల ఆస్తులు ఉండవచ్చు. కానీ కెరీర్, సక్సెస్ ఎవరూ కొనుక్కోలేం. అది మళ్లీ మనకు వస్తుందా అనుకున్నపుడు ప్రవీణ్ సత్తారు 'గరుడవేగ'తో మ్యాజిక్ చేసి మమ్మల్ని పైకి తీసుకొచ్చారని తెలిపారు.

బాహుబలితో పాటు ‘గరుడవేగ' గురించి కూడా..
‘గరుడవేగ' ఈ రోజు టాప్ రేంజిలో ఉంది. బాహుబలి గురించి మాట్లాడినపుడు గరుడ వేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. సినిమాను అంత పెద్ద సక్సెస్ చేశారు. ఆ సక్సెస్ ఎంత గుర్తుంటుందో... అంత బాధను కూడా గుర్తుండేలా చేసింది. ఆ మూవీ సమయంలో మేము మా అత్తగారిని, మా అన్నయ్యను కోల్పోయామని జీవిత తెలిపారు.

‘కల్కి'ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డాను
మా అన్నయ్యను.. అన్నయ్య అని చాలా తక్కువసార్లు పిలిచాను. నేను అన్నయ్య అని పిలిచే ఒకే ఒక వ్యక్తి సి కళ్యాణ్ అన్నయ్యనే. గరుడ వేగ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కల్కి మొదలు పెట్టాం. ఎంత సక్సెస్ వచ్చినా, పేరు వచ్చినా సినిమా తీయడం చాలా కష్టం. అది ఒక లేడీగా నేను ఫైట్ చేస్తూ ముందుకు వెళ్లి చేయడం ఇంకా కష్టపడాల్సి వచ్చిందని జీవిత తెలిపారు.

దర్శకుడిని ఒప్పించడానికి సమయం పట్టింది
‘కల్కి' చేద్దామనుకున్నాక దర్శుడు ప్రశాంత్‌ను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. మొదట ఆయన కథ, డైలాగ్స్ మాత్రమే ఇచ్చాడు. సబ్జెక్ట్ పూర్తయ్యాక దీన్ని తను డైరెక్ట్ చేస్తే బావుంటుంది అన్నాను. అపుడు ఆయనకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. ఏది చేయాలో నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాడు. చివరకు చేస్తాను అన్నాడు.

సినిమా తీయడం, రిలీజ్ చేయడం చాలా కష్టం
బడ్జెట్ వేసుకున్నాక ఇంత ఖర్చు అవుతుంది చేయగలమా? అని టెన్షన్ పడుతున్నపుడు కళ్యాణ్ అన్నయ్య చేయడానికి ముందుకు వచ్చారు. వెనక ఉండి అన్నీ నువ్వు చూసుకో నేను డబ్బులు పెడతా అన్నాడు. ఆయన వల్లే ‘కల్కి' మొదలైంది. ఈ రోజుల్లో సినిమాలు తీయడం, రిలీజ్ చేయడం కష్టం. రిలీజైన తర్వాత డబ్బులు తిరిగి రాబట్టుకోవడం ఇంకా కష్టమైన విషయం. ఈ సినిమా విషయంలో కళ్యాణ్ అన్నయ్య ఉన్నాడు కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాను అని జీవిత తెలిపారు.


Click it and Unblock the Notifications











