తేలిపోతున్న జెనీలియా
గెలుపు కన్నా గొప్ప కిక్ మరెందులోనూ ఉండదంటారు. అలాంటి కిక్‌ను సంతోషంగా ఆస్వాదిస్తున్నారు బొమ్మరిల్లు యూనిట్ సభ్యులు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం రాష్ట్రంలోనూ, విదేశాలలోనూ మంచి టాక్ సంపాదించడంతో తమ కృషికి తగ్గ గుర్తింపు లభించిందని యూనిట్ వారంతా ఆనందంలో తేలిపోతున్నారు. కాసుల వర్షం కురిసి నిర్మాత దిల్ రాజు, మొదటి సినిమా ఇంత రేంజ్‌లో సక్సెస్ అయి దర్శకుడు భాస్కర్, తెలుగులో మంచి బ్రేక్ వచ్చిందని హీరో సిద్ధార్థ, ఇంక ఇతర టెక్నీషియన్లు.. ఎవరి ఆనందంలో వాళ్లున్నారు. నేనూ అంతే! అంటోంది జెనీలియా.
బొమ్మరిల్లు ఘనవిజయం సాధించడం మాత్రమే కాదు, ఈ చిత్రంలో నా పాత్రకు విశేష స్పందన వస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నా నటనని మెచ్చుకుంటూ అభినందనలు వెల్లువలా వస్తున్నాయి అంటూ ఈ గోవా ముద్దుగుమ్మ మురిసిపోతోంది.
అంతకుముందు బొమ్మరిల్లు సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ - నన్ను జెనీలియా ఈ సినిమాలో డామినేట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది - అని హీరో సిద్ధార్థ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.
నా గత చిత్రాలు తెలుగులో హిట్ నటిగా నాకు సంతృప్తినీ, గుర్తింపునీ ఇవ్వలేకపోయాయి. కానీ బొమ్మరిల్లు తర్వాత నా కెరీర్‌ను ఒక మలుపు తిప్పింది. ఈ సినిమాలో నా పాత్రను చూసి అంతా అభినందిస్తున్నారు. ఇంతకంటే ఒక నటికి ఇంకేం కావాలి? ఈ సినిమాలో నా పాత్రకు నేను తగిన న్యాయం చేశాననుకుంటున్నాను. ఇక నుంచి నాకు వచ్చే పాత్రలలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తపడతాను అని ఉత్సాహంగా చెప్పింది.
బాయ్స్ తర్వాత సిద్ధార్థతో నటించిన బొమ్మరిల్లు ఇంత పెద్ద హిట్ కావడం ఇద్దరికీ సంతోషం. ఈ విజయానికి పూర్తి క్రెడిట్ డైరెక్టర్ భాస్కర్, ప్రొడ్యూసర్ దిల్ రాజులదే అంటూ థాంక్స్ చెప్పింది.


Click it and Unblock the Notifications