రంగస్థలం: ‘జిలేగు రాణి’ మేకింగ్ వీడియో, రెస్పాన్స్ అదుర్స్....
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ నాన్ బాహుబలి కేటగిరీలో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సుకుమార్ సినిమా అంటేనే అదిరిపోయే మాస్ సాంగ్ ఒకటి తప్పకుండా ఉంటుంది. రంగస్థలంలో 'జిగేలు రాణి' అనే ప్రత్యేక గీతాన్ని మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేశారు. ఇందులో రామ్ చరణ్‌తో పూజా హెగ్డే ఊరమాస్ చిందులేసి ఎంటర్టెన్ చేసింది. సినిమాలో సూపర్ హిట్టయిన పాటల్లో ఇదీ ఒకటి. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.
గురువారం సాయంత్రం ఈ పాటను విడుదల చేయగా కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ రీచ్ అయింది. సినిమా విడుదలై నెల రోజులైనా ఈ చిత్రంపై ఇంకా క్రేజ్ తగ్గలేదని ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు.
రంగస్థలం ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణాలు రొటీన్ తెలుగు సినిమాలకు భిన్నంగా పల్లెటూరి నేపథ్యంతో సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్, చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, ప్రెసిడెంట్ పాత్రలో జగపతి బాబు, రంగమ్మత్త పాత్రలో అనసూయ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అని చెప్పక తప్పదు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రంతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుని హాట్రిక్ కొట్టారు. తొలుత 'శ్రీమంతుడు', ఆ తర్వాత 'జనతా గ్యారేజ్', తాజాగా 'రంగస్థలం' ఇలా ఒకదాన్ని మించి మరో హిట్ కొడుతూ తమ బేనర్ ప్రతిష్టను మరింతగా పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించబోయే తర్వాతి సినిమాను కూడా మైత్రి మూవీస్ వారే నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు హీరోగా నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











