వేణుస్వామి నిజస్వరూపం అదే.. లైవ్‌లో బయటపెట్టిన టీవీ 5 మూర్తి
టీవీ 5 మూర్తి.. తెలుగు మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. సామాన్య స్థాయి నుంచి నేడు పేరు మోసిన జర్నలిస్ట్‌గా ఆయన పాపులర్ అయ్యారు. టీవీ చర్చా కార్యక్రమాల్లో హేమాహేమీలైన వారిని తన వాడి వేడి ప్రశ్నలతో చెడుగుడు ఆడుకుంటారు మూర్తి. అయితే ఈ దూకుడు కొన్ని సార్లు ఇబ్బంది పెట్టింది. ఇందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, సినీనటులు కౌశల్ మందా, శ్రీరెడ్డిలతో వివాదాలు వున్నాయి. ఈ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటి వెనుక ఏం జరిగిందనే విషయాలను ఆయన పంచుకున్నారు.
ముఖ్యంగా వేణుస్వామి ప్రధాని నరేంద్ర మోడీతో దిగిన ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ప్రముఖుల జాతకాలు చెబుతూ అప్పటికే ఫేమస్ అయిన వేణుస్వామికి.. మోడీతో దిగినట్లుగా వున్న ఫోటో మరింత ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సినీ, రాజకీయ నాయకులు వేణుస్వామి వద్దకు క్యూకట్టినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోటోపై అనుమానం రావడంతో అది ఒరిజినలా..? ఫేకా ..? అన్నది తేల్చాలని డిసైడ్ అయినట్లు మూర్తి తెలిపారు.

దీనిలో భాగంగా కొందరు మిత్రులతో కలిసి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని వేణుస్వామి కలిశారా, ఫోటో దిగారా అన్న వివరాలను తెలపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసినట్లుగా మూర్తి చెప్పారు. దీనిపై స్పందించిన పీఎంవో కార్యాలయం అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఆ ఫోటో ఎక్కడిది అని సాంకేతికత సాయంతో ఆరా తీయగా.. అది అస్సాం ముఖ్యమంత్రితో దిగినట్లుగా తేలిందని మూర్తి పేర్కొన్నారు. సీఎం ముఖాన్ని తీసేసి , ఆ ప్లేస్‌లో మోడీ ముఖాన్ని పెట్టి మార్ఫింగ్ చేసినట్లుగా నిర్థారించినట్లు మూర్తి చెప్పారు.
ఆ తర్వాత వేణుస్వామిని లైవ్‌లోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను కూడా కలవలేదని ఒప్పుకున్నారని మూర్తి పేర్కొన్నారు. ప్రధాని ఫోటోను ప్రచారానికి వాడుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతాయనే ఉద్దేశంతో ఆ రోజున లైవ్ షో చేశానని ఆయన వెల్లడించారు. ప్రధాన మంత్రే.. వేణుస్వామిని కలిశారంటే దేశంలో వున్న రాజకీయ నేతలు మొత్తం ఆయన దగ్గరికి పరిగెడతారని, పీఎంను ప్రచారానికి వాడటకం కరెక్ట్ కాదన్నదే తన ఉద్దేశ్యమని మూర్తి వెల్లడించారు.

అలాగే బిగ్‌బాస్‌లో పాల్గొన్న కౌశల్ అభిమానులు.. కౌశల్ ఆర్మీ పేరిట చేసిన ఓవరాక్షన్‌ను కూడా ఎండగట్టినట్లు ఆయన తెలిపారు. బిగ్‌బాస్ హౌస్‌లో వున్న మిగిలిన కంటెస్టెంట్స్‌ను, వారి కుటుంబ సభ్యులను చాలా రకాలుగా వేధించారని మూర్తి గుర్తుచేశారు. బిగ్‌బాస్ విన్నర్ అయినందుకు ప్రధాని స్వయంగా అభినందించారంటూ కౌశల్ చెప్పుకునేవారని.. దీంతో తాను లైవ్‌లో ప్రశ్నించానని చెప్పారు. ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో తెలుసుకుని, దానికి కాల్ చేయగా.. అవతలి వైపున ఓ తెలుగు వ్యక్తే ఫోన్ లిఫ్ట్ చేశాడని, అతను కూడా జర్నలిస్టేనని ఢిల్లీ ఏపీ భవన్‌లో పనిచేస్తానని చెప్పాడని మూర్తి తెలిపారు. ఈ నిజాన్ని లైవ్‌లో బయటపెట్టానని కౌశల్ ఆర్మీ తనను కూడా టార్గెట్ చేసిందని.. కానీ తాను దేనికి భయపడే రకాన్ని కాదని టీవీ 5 మూర్తి తేల్చిచెప్పారు.


Click it and Unblock the Notifications











