Telangana Elections: ఓట్ కోసం లైన్‌లో స్టార్లు.. తారక్, అల్లు అర్జున్ అలా.. ఇంకా ఏ హీరోలు వేశారంటే!
తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సమయం వచ్చేసింది. ఐదేళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టడం కోసం జరిగే ఎన్నికలు రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం తమదే అంటే తమదే అంటూ అటు అధికార.. ఇటు ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో ఆసక్తిరమైన పరిస్థితితుల నడుమ ప్రారంభం అయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే చాలా మంది ఓటర్లు క్యూ లైన్‌లలో నిల్చుని ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. వీరితో పాటు చాలా మంది ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లిహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ బూత్ నెంబర్ 150లో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇందుకోసం తారక్ కుటుంబ సభ్యులు మొత్తం పోలింగ్ కేంద్రం ఆవరణలో దాదాపు అరగంట పాటు లైన్‌లో నిల్చుని ఓట్లు వేశారు.

టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వాడుకున్నాడు. అతడు కూడా ఎన్టీఆర్ మాదిరిగానే సామాన్యులతో కలిసి చాలా సేపు లైన్‌లో నిల్చున్నాడు. అలాగే, మరో తెలుగు హీరో సుమంత్ జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన భార్య సురేఖతో కలిసి ఓటింగ్ మొదలైన కొద్ది సేపటికే జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నాడు. అక్కడ సామాన్యులతో పాటు చాలా సేపు లైన్‌లో నిల్చున్నారు. అనంతరం తన ఓటును వేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో విక్టరీ వెంకటేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానికంగా ఉన్న మణికొండ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అలాగే, ఇదే పోలింగ్ కేంద్రంలో దర్శకుడు తేజ కూడా ఓటు హక్కును వాడుకున్నారు. వీళ్లతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సైతం ఓట్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











