10 రోజుల్లో జూ ఎన్టీఆర్ బాద్‌షా!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందబోతున్న బాద్‌షా చిత్రం సరిగ్గా మరో 10 రోజుల్లో అంటే మే 10న సెట్స్ పైకి రానుంది. తొలి షెడ్యూల్ యూరఫ్‌లో ప్లాన్ చేశారు. ఈ మేరకు యూనిట్ సభ్యులంతా అక్కడి వెళ్లనున్నారు. రెండు నెలల పాటు అక్కడ షూటింగ్ జరుగనుంది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'బాద్‌షా' సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి నెలలోనే ఈచిత్రం షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్‌పై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా వెంకటేష్ కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ... 'దూకుడు' లాంటి సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎన్టీఆర్ చిత్రమంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఇందులో వుంటాయి. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాక్షన్‌తో పాటు ఇందులో ఓ అందమైన ప్రేమకథ ఉంటుందని అన్నారు.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీనువైట్లతో ఆ స్థాయి సినిమా చేయాలన్న ఆలోచనతో చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ఎన్టీఆర్‌కు, శ్రీనువైట్లకు, మా సంస్థకు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలవాలన్న ఆశతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాను అని అన్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
యాక్షన్ ఎంటర్‌టైనర్ 'దమ్ము' చిత్రం విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్న జూనియర్ బాద్‌షా ద్వారా తనలోని సరికొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపబోతున్నాడు. సంక్రాంతి నాటికి బాద్ షా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











