జూ ఎన్టీఆర్ స్పెషల్ బర్త్ డే స్పెషల్ సెలబ్రేషన్స్...!
సింహం కడుపున సింహమే పుడుతుంది... పులి కడుపున పులే పుడుతుంది... నటుడి వంశంలో నటులే పుడతారు. అందుకు జూనియర్ ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం. మహానటుడు ఎన్టీఆర్ కి... తాతకు తగ్గా మనవడిగా రాణిస్తున్న ఈ యువకిశోరం జన్మదినం నేడు. అయితే, నేటి పుట్టిన రోజుకి ఓ ప్రత్యేకత వుంది. లక్ష్మీ ప్రణతిని ఇటీవలే మనువాడి ఓ ఇంటివాడైన జూ ఎన్టీఆర్ జంటగా జరుపుకుంటున్న జన్మదినం ఇది. జస్ట్ మారిషెష్ హనీమూన్ ట్రిప్ నుండి తిరిగొచ్చిన జూ ఎన్టీఆర్ వచ్చిరాగానే మరో శుభాకార్యంలో పాల్గొంటున్నందు అభిమాను చాలా సంతోషంగా ఉన్నారు. జూబ్లి హిల్స్ లోని తన కొత్త ఇంటిలో కొంతమంది స్పెషల్ గెస్ట్ తో, అమ్మానాన్నలతో బాటు అర్ధాంగి, అత్తామామలు తోడుగా జరుపుకుంటున్న తొలి వేడుక ఇది. వీరందరి సమక్షంలో నేడు ఈ యంగ్ టైగర్ బర్త్ డే కేక్ ను కట్ చేస్తున్నాడు.
కెరీర్ పరంగా జూ ఎన్టీఆర్ వయసు కేవలం పదేళ్లు. ఇంతవరకు చేసిన సినిమాలు జస్ట్ పందొమ్మిది. అయితే సంపాదించుకున్న ఇమేజ్ మాత్రం అంతా ఇంతా కాదు...వంద సినిమాల ఇమేజ్! ఈ ఇమేజ్, ఫాలోయింగ్ ఈ నందమూరి అందగాడికి అంత ఈజీగా వచ్చేసింది కాదు. ఇంటి పేరు, తాత రూపు ఇనిషియాల్ గా ఓ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పరిస్తే... మిగతాదంతా అతని కష్టార్జితం. డ్యాన్సుల్లో గానీ, యాక్షన్ సీన్స్ లో కానీ అతను పడే కష్టం, తపన, తాపత్రయం అతన్నీవేళ ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆ కష్టమే అతనికి శ్రీరామరక్షగా నిలుస్తుంది. ముందు ముందు మరిన్ని విజయాలకు నాంది. ఈ జన్మదినం శుభ సందర్భంగా జూ ఎన్టీఆర్ కి దట్స్ తెలుగు మెనీ హ్యాపీ రిటర్న్స్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











