దేవర చూసే వరకూ బతికించండి.. కన్నీరు పెట్టిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్ చివరి కోరిక
మిగిలిన రంగాలతో పోల్చుకుంటే సినిమాలకు ఇండియాలో ప్రత్యేకత చాలానే ఉంది. ఎంతలా అంటే ఇక్కడ హీరోలు, హీరోయిన్లను అభిమానులు దేవుళ్లతో సమానంగా కొలుస్తుంటారు. అలా టాలీవుడ్‌లో సైతం ఎంతో మంది భారీ ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనదైన మార్కును చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. దీనికితోడు వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమాని తన చివరి కోరిక తీర్చాలంటూ చెప్పడం కన్నీరు తెప్పిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే...
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ స్వింగ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. 'దేవర' అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతుంది. దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్స్‌తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

ఎన్టీఆర్ మూవీ 'దేవర' ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గుండెలు పిండేసే స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది. తిరుపతికి చెందిన కౌశిక్ (19) కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడు 'దేవర' మూవీని చూడాలని చివరి కోరికను కోరుతున్నాడు.

కౌశిక్ తాజాగా తన తల్లిదండ్రులతో 'అమ్మా నేను బతకనని తెలుసు. నా కోసం బాధపడకండి. దేవర సినిమా విడుదల వరకూ బతికించండి చాలు. నా చివరి కోరిక తీర్చండి' అంటూ వేడుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా వాళ్లు మీడియాతో చెప్పారు. అంతేకాదు, 'నా బిడ్డ జూనియర్ ఎన్టీయార్‌కు వీరాభిమాని. దేవర సినిమా చూసి చచ్చిపోతా.. 27వ తేదీ దాకా బతికించండని వేడుకుంటున్నాడు. నా బిడ్డను బతికించండయ్యా. చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు నా బిడ్డ చివరి కోరిక తీర్చండి' అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
19 ఏళ్ల వయసులోనే ప్రాణాపాయంలో ఉన్న కౌశిక్ గురించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అతడిని బతికించడం కోసం స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. మరి దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తాడో లేదో అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











