న్యూ ట్రెండ్ కు నాంది పలుకుతున్న జూ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’..!
విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత బివిఎన్ఎస్ ప్రసాద్ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 200 ఎన్టీఆర్ కటౌట్లు ఏర్పాటు చేస్తూ కొత్త ట్రెండ్ కు నాంది పలుకుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లు, నగరాలతోపాటు, పలు పట్టణాలలోని ముఖ్య కూడళ్లలో నందమూరి అందగాడి కటౌట్లు కొలువు తీరనున్నాయి.
చిత్ర పరిశ్రమలో ఇంత పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేయటం ఇదే ప్రధమమని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్టీఆర్ తో సాంబ చిత్రం నిర్మించిన కొడాలి నాని ఆ సినిమా ఆడియో వేడుకకు సుమారు అరకోటి వరకూ ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. మరి ఈ కటౌట్ల పబ్లిసిటీ టాలీవుడ్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందనే చెప్పవచ్చు.
'ఊసరవెల్లి' చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అందాల తార తమన్నా తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా,దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు ఎన్టీఆర్ కు దసరా సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. గత ఏడాది విజయదశమికి 'బృందావనం'తో అదుర్స్ అనిపించిన ఎన్టీఆర్ ఈసారి కూడా మరోసారి తన సత్తా నిరూపించుకునేందుకు రెడీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











