మగధీరయే అసలు సిసలైన టార్గెట్..!
జూ ఎన్టీఆర్ శక్తి ఏమిటనేది మరో రెండు రోజులు గడిస్తే తేలిపోతుంది ఇంతదాకా సూపర్ హిట్స్ అయితే ఇచ్చాడు కానీ ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయాడు ఎన్టీఆర్. ఆ లోటుని తీర్చే సినిమా అవుతుందని శక్తి మీద అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఏప్రిల్ ఒకటి ఎప్పుడొస్తుందాఅని టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే, జూ ఎన్టీఆర్ నటించిన 'శక్తి సినిమా ఆరోజు విడుదలవుతోంది. ఎన్నో ప్రత్యేకతలు వుండడం వల్లే ఈ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది. ఇంతవరకు తెలుగులో ఏ చిత్రానికి అవ్వనంత ఖర్చు దీనికైంది. ఏ సినిమా జరుపుకోనన్ని లోకేషన్లలో ఇది షూటింగ్ జరుపుకుంది. సుమారు నలభై కోట్లు అయిందంటున్నారు. ఒక ఐదారు ఎక్కువేసి చెప్పినా కూడా ఆ బడ్జెట్ ఎక్కువే. ఒక్క జూ ఎన్టీఆర్ పారితోషికమే 12 కోట్లంటున్నారు!
జూ ఎన్టీఆర్ వరుసగా అదుర్స్, బృందావనం వంటి హిట్స్ తో వుండడం వల్ల సినిమాకి వెయిట్ ఎక్కువ వచ్చింది. సినిమా బిజినెస్ కూడా అన్ని ఏరియాలలోనూ జూ ఎన్టీఆర్ గత చిత్రాలకన్నా ఎక్కువే చేసిందట. ఇక ఇప్పుడు అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉండడానికి కారణం, మగధీర సినిమాను ఇది క్రాస్ చేస్తుందా? లేదా? అన్న విషయం గురించే. ఇంతవరకు టాలీవుడ్ లో మగధీరదే ఆల్ టైం రికార్డ్.! అయితే మగధీర రికార్డులని కొట్టడమంటే ఆషామాషి విషయం ఏమీ కాదని తేలిపోయింది. ఎన్టీఆర్, బాలకృష్ణ, రజనీకాంత్ ల సినిమాలకి ఎంత హిట్ టాక్ వచ్చినా కానీ మగధీరలో సగం కూడా చేయలేకపోయాయి. స్టార్ పవర్ కి రాజమౌళి ఫ్యాక్టర్ తోడయి పైగా అందులోనూ అన్నీ సరిగ్గా కలిసొచ్చి మగధీర అంతటి విజయం సాధించింది.
తలొకళ్ళూ తలో 'ఫిగారూ"చెప్పినప్పటికీ మొత్తానికి మగధీర కలెక్షను 60 కోట్లకు కాస్త అటు ఇటు వుంటుంది. దానిని క్రాస్ చేసే 'శక్తి" జూ ఎన్టీఆర్ కే వుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి . అందుకే ఇప్పుడు అందరి కళ్ళూ ఈ సినిమాపైనే వున్నాయి. పైకి చెప్పనప్పటికే, మగదీరను క్రాస్ చేసి, సరికొత్త రికార్డు కొట్టాలన్నది జూ ఎన్టీఆర్ కోరిక. ఎందుకంటే, నేటి యంగ్ బ్యాచ్ లో అసలైన పోటీ జూ ఎన్టీఆర్ కూ, రామ్ చరణ్ కూ మధ్యే ఉందన్నది అందరికీ తెలిసిందే. మరి, 'శక్తి" మగధీరను క్రాస్ చేసి నిలబడుతుందా?


Click it and Unblock the Notifications











