టీడీపీ విక్టరీపై ఎన్టీఆర్ ట్వీట్: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అలాంటి మెసేజ్!
దాదాపు రెండు నెలల పాటు ఆసక్తిని రేపిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అంచనాల నడుమ సాగిన ఈ సమరంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజేతగా నిలిచింది. తద్వారా ఏపీలో సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
ఇక, కూటమి విజయంపై సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దీనిపై కామెంట్స్ చేశాడు. ఇంతకీ అతడు ఏమన్నాడో మీరే చూసేయండి మరి!

164 సీట్లతో కూటమి విజయం
గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి విజయం సాధించింది. ఆరంభం నుంచీ హవాను చూపించిన కూటమి 175 స్థానాలకు గానూ ఏకంగా 164 నియోజకవర్గాల్లో గెలిచింది. తద్వారా ఈ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఈ మూడు పార్టీల తరపున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ మేరకు ఆయన జూన్ 9వ తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అంతకు ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేబినెట్ కూర్పుతో పాటు పలు అంశాలపై చర్చించబోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందన
ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఊహించని రీతిలో ఆధిపత్యాన్ని చూపించి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో సుదీర్ఘమైన పోస్టును చేశారు.
ప్రియమైన మావయ్యకు అని
చంద్రబాబు నాయుడు సాధించిన విజయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. తాజాగా తన ట్విట్టర్‌లో 'ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకు... ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
ఫ్యామిలీ మొత్తానికి చెబుతూ
ఇదే ట్వీట్‌లో జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తూ.. 'అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, వరుసగా మూడోసారి ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయికి, పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన శ్రీభరత్‌కు, పురందేశ్వరి అత్తకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు.
పవన్ కల్యాణ్ పేరు కూడా
మొదటి ట్వీట్‌లో తన కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ప్రస్తావించిన జూనియర్ ఎన్టీఆర్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం మరో పోస్టు పెట్టాడు. అందులో 'అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ చెప్పాడు. ఇక, ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











