'ఇది చాలు ఈ జన్మకు...' - జూ ఎన్టీఆర్
"ఏ జన్మలో చేసుకొన్న అదృష్టమో కానీ...అభిమానమనే చిన్న బంధంతో మనమంతా ఇలా కలుసుకుంటున్నాం. ఇది చాలు ఈ జన్మకు. నందమూరి హీరోల పట్ల మీరు చూపించే అభిమానం ఇలాగే ఇకముందు కూడా కొనసాగాలి. మీ అండదండలతోనే నేను ఇంతవాడిని అయ్యాను. నందమూరి కుటుంబంపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అన్నారు జూ ఎన్టీఆర్. ఆయన జన్మదిన వేడుకలు వేడుకలు సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. మాదాపూర్ లో ఉన్న సైబర్ గార్డెన్స్ ఈ వేడుకలకు వేదికగా మారింది. బర్త్ డే కేక్ కట్ చేసిన అనంతరం అభిమానులు తయారు చేయించిన బంగారు కిరీటాన్ని ఎన్.టి.ఆర్. తలకు అలంకరించారు నాని. అనంతరం అభిమానులకు అభివాదం చేసి ఇలా స్పందించారు.
అలాగే..."ఇంతకాలం నాకు అండగా నిలిచిన అభిమానుల సమక్షంలో తొలిసారిగా పుట్టిన రోజు జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను బాలకృష్ణగారి అభిమానిని. ఆయన నటించిన తాజా చిత్రం 'సింహా' చిత్రం ఘనవిజయం సాధించడం మన అందరికీ ఆనందం కలిగించిన అంశం. ఈ సందర్భంగా 'లైలా' తుఫాను వల్ల దెబ్బతిన్న వారిని ఆదుకోవడం కోసం నా అభిమానులు మూడు లక్షల రూపాయల విరాళం అందిస్తున్నారు. ఆ విషయాన్ని నా ద్వారా ప్రకటించమన్నారు. ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగించాలి. జై ఎన్.టి.ఆర్., జై బాలయ్య' అంటూ ప్రసంగాన్ని ముగించారు ఎన్.టి.ఆర్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రాజు, శిరీష్, భోగవల్లి ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, అఖిలభారత ఎన్.టి.ఆర్. అభిమాన సంఘ అధ్యక్షుడు శ్రీపతిరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











