అల్లుడు ధనుష్‌తో కలిసి ‘కాలా’ తెలుగు వెర్షన్ ప్రమోషన్స్‌లో రజనీకాంత్
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'కాలా' జూన్ 7న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా సినిమా విడుదలవుతుండటంతో హైదరాబాద్, ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తెలుగు వెర్షన్ ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్, ధనుష్ కలిసి సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. తమ సినిమాను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ప్రెస్ మీట్ ప్లాన్ చేశారు.
ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూఎస్ఏలో కనీసం 300 లొకేషన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారట. రజనీ అభిమానులు భారీగా ఉండే మలేషియా, సింగపూర్, జపాన్, గల్ఫ్ దేశాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

రజనీకాంత్‌తో పాటు ప్రముఖ హిందీ నటుడు నానా పాటేకర్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముంబై మురికివాడ ధారావి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ధారావి డాన్ పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. నానా పాటేకర్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నారు. కబాలి తర్వాత దర్శకుడు పా రంజిత్‌తో రజనీకాంత్ చేస్తున్న రెండవ సినిమా ఇది. తొలి మూవీ సంచలన విజయం సాధించడంతో ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన లైకా ప్రొడక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతోంది.


Click it and Unblock the Notifications











