హీరోయిన్ కాజల్ కోసం 50 లక్షల మంది!
హైదరాబాద్: హీరోయిన్ కాజల్ సోషల్ నెట్వర్కింగులో తన సత్తా ఏమిటో నిరూపించుకుంది. మగధీర చిత్రం తర్వాత సౌతిండియా స్టార్ హీరోయిన్‌గా టాప్ రేంజికి ఎదిగిన కాజల్ యువతరం మెచ్చే నటిగా మారింది. ప్రముఖ సోషల్ నెట్వర్కింగు వెబ్ సైట్ ఫేస్ బుక్‌లో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 5.2 మిలియన్లు(52 లక్షలు)దాటడమే ఇందుకు నిదర్శనం.
'లక్ష్మీ కళ్యాణం' అనే తెలుగు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కాజల్...'చందమామ' చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పౌరుడు, ఆటాడిస్తా, తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా అమ్మడుకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 2009లో వచ్చిన 'మగధీర' చిత్రంతో కాజల్ దశ తరిగింది. ఆ చిత్రం సంచలన విజయంతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా అవతరించింది.
అనంతరం స్టార్ హీరోలైన అల్లు అర్జున్‌తో ఆర్య 2, ప్రభాస్‌తో డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, జూ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేష్ బాబుతో బిజినెస్ మేన్, తమిళంలో విజయ్‌తో తుపాకి లాంటి చిత్రాలు కాజల్ మరింత పాపులర్ కావడానికి తోడ్పడ్డాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'జిల్లా'లో నటిస్తోంది.
ప్రస్తుత దక్షిణాదిన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో కాజల్ ఒకరు. సింగం, స్పెషల్ ఛబ్బీస్ చిత్రాలతో బాలీవుడ్ చిత్ర సీమలో కూడా కాజల్ అడుగు పెట్టింది. ఇప్పటి వరకు కాజల్ దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించింది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా హీరోయిన్‌గా పలు తెలుగు చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications












