'ఓం శాంతి' చిత్రంలో కాజల్ కేరెక్టరైజేషన్?
జీవితంలో ఇంకా ఏదో కావాలని ఆశిస్తూ, తనకేం కావాలో తనకే తెలియని కాలేజీ అమ్మాయి పాత్ర కాజల్ 'ఓం శాంతి' సినిమాలో ధరించారంటూ దర్శకుడు ప్రకాష్ చెప్తున్నారు. నిజానికి ఈ కథ తయారు చేసుకుంటున్న సమయంలో హీరోయిన్ పాత్రకు కాజలే నా మదిలో మెదిలారు. ఆ పాత్ర ఆమె కోసమే పుట్టినట్టుంటుంది. తనకు అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలి...అని ఎదురుచూసే ఓ విచిత్రమైన పాత్ర కాజల్‌ది అన్నారు.అలాగే మిగతా పాత్రలూ వైవిధ్యంగా ఉంటాయంటూ హామీ ఇస్తున్నారు.
ఇక నవదీప్ కేరక్టర్ విషయానికొస్తే...రెండు తరాల మధ్య ఇరుక్కుపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆనంద్‌గా ఇందులో ఆయన కనిపిస్తారు. పెద్దల నిర్ణయాలను గౌరవించలేడు, తన నిర్ణయానికి కట్టుబడలేడు. ఎప్పుడూ సందిగ్ధంలో ఉండే పాత్ర తనది. అదే మనస్తత్వంతో పాటు..అదే పరిస్థితులు ఎదుర్కొంటున్న మరో పాత్ర అదితీశర్మది. ఇక నిఖిల్ పాత్ర విషయానికొస్తే...దేశంలో తనంత అదృష్టవంతుడు లేడనుకునే పాత్ర తనది. "పరిశ్రమకి కాబోయే సూపర్‌స్టార్‌ని నేనే అనే ఓవర్ కాన్ఫిడెంట్‌తో జీవనం సాగిస్తుంటాడు. పెళ్లికాని ముస్లిం యువతి నూరిగా బిందుమాధవి కనిపిస్తారు అంటూ 'ఓం శాంతి' లోని పాత్రలను మీడియాకు పరిచయం చేసారు ప్రకాష్.
భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఈ అయిదుగురు ఒక ఉత్కంఠభరిత సందర్భంలో కలుస్తారు. ఈ అయిదుగురి అంతిమ లక్ష్యం శాంతిని పొందడమే. ఆ శాంతి కోసం ఆ పాత్రలు ఏం చేశాయి అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్తున్నారు. నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, అదితి శర్మ, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రై. లిమిటెడ్ సంస్థ అధినేత్రి శేషుప్రియాంక చలసాని నిర్మిస్తున్న 'ఓం శాంతి' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న సంక్రాంతి విడుదలవుతోంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను తమిళ హీరో మాధవన్ పోషించనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











