కాజల్ మిస్, విమానాశ్రయ సిబ్బందిపై రుసరుసలు
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో జరిగిన బాద్‌షా ఆడియో విడుదల కార్యక్రమానికి హీరోయిన్ కాజల్ మిస్సయింది. విమానం తప్పిపోవడంతో ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన బాద్‌షా సినిమాలో ఆమె కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. అందుకు బాధపడుతూ, కోయంబత్తూరు విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వ్యాఖ్యలు చేసింది.
హైదరాబాదుకు కొద్దిలో విమానం మిస్సయ్యానని, ఈ రాత్రి తన బాద్‌షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఉందని, ఈ కార్యక్రమానికి రావడానికి తాను ఎంతో ఆతురత చెందానని ఆమె ఆదివారం వ్యాఖ్యానించింది. పొలాచి నుంచి ప్యాక్ చేసుకుని మానియాక్ లాగా విమానాశ్రయానికి పరుగెత్తుకొచ్చానని చెప్పింది.
తీవ్రమైన దురుసుతనంతో, దుర్మార్గంగా వ్యవహరించి స్పైస్ జెట్ సిబ్బంది తనను విమానం ఎక్కనీయలేదని ఆమె విరుచుకుపడింది. బోర్డింగ్ కార్డు ముందుగానే తీసుకున్నానని, సిబ్బంది సీనియర్లతో మాట్లాడానని, అయినా ఫలితం కనిపించలేదని ఆమె బాధపడింది. కోయంబత్తూరులో ఇటువంటి దురుసు ప్రవర్తనను తాను ఊహించలేదని, చాలా నిరాశకు గురయ్యానని వ్యాఖ్యానించింది.
కాజల్ గైర్హాజరు అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అలరించారు. అయితే, సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మరణించిన ప్రభావం ఆడియో విడుదల కార్యక్రమంపై పడినట్లే కనిపించింది.


Click it and Unblock the Notifications











