మా బావమరిది ఉండబట్టే...: కళ్యాణ్ రామ్
హైదరాబాద్ : "మా బావమరిది హరి అన్ని విషయాలను పక్కనుండి చూసుకున్నారు. అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడేవాడు కాదు. అదే వృథా అనుకుంటే రూపాయి కూడా పెట్టే వ్యక్తి కాదు. దాంతో నేను నిర్మాణం సంగతి మర్చిపోయి, పూర్తిగా నా ఏకాగ్రతను నటన మీదే పెట్టాను అంటున్నారు కళ్యాణ్ రామ్. తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమా 'ఓమ్'. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
గుండుతో కనపడటానికి కారణం చెప్తూ... గుండు గీయించుకోవడం కూడా కథలో భాగమే. పాత్రలో ఉన్న ఇంటెన్స్‌ని, డెప్త్‌ని చెప్పాలంటే అలా గుండు గీయించుకోవడం తప్పదు. నేను నటించిన సినిమాలను నేనెప్పుడూ ఒక్కసారికన్నా ఎక్కువ చూడలేదు. కానీ ఈ సినిమాను ఇప్పటికే నాలుగు సార్లు చూశాను. సునీల్‌రెడ్డికి మంచి భవిష్యత్తుంది. ఎక్స్‌పీరియన్స్డ్‌లాగా హ్యాండిల్ చేశాడు. ఈ నెల 19న దాదాపు 70 స్క్రీన్లలో త్రీడీని విడుదల చేస్తాం. మిగిలిన అన్ని చోట్లా మామూలుగానే విడుదల చేస్తాం అన్నారు.
టైటిల్ జస్టిఫికేషన్ గురించి చెప్తూ..."మంచి పనికి ఎవరైనా శ్రీకారం 'ఓంకారం'తో చుడతారు. మేం కూడా కొత్త టెక్నాలజీకి ఈ సినిమాతో ఓం కారం చుట్టాం. అందుకే 'ఓం' అనే పేరు పెట్టాం. ఓం అనగానే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. ప్రేక్షకులకు నెక్స్ట్‌లెవల్ సినిమాను చూపించాలనే ఆశయంతోనే వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సినిమాను త్రీడీలో చేశాం. మా 'ఓం' టైట్ స్క్రీన్‌ప్లేతో రెండు గంటలు ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో మా నాన్న పాత్రలో కార్తిక్ చేశారు. ఆయన ఇప్పటిదాకా నాన్న పాత్రలు చేయలేదు. అసలు ఈ మధ్య సినిమాలకే దూరంగా ఉంటున్నారు. కానీ ఈ కథ విని వెంటనే చేయడానికి ఒప్పుకున్నారు.'' అన్నారు.అలాగే "టుడీ, త్రీడీ చిత్రాల చిత్రీకరణకు చాలా తేడాలుంటాయి. మామూలు సినిమాకన్నా త్రీడీ సినిమాల షూటింగ్‌కు ఒకటిన్నర రెట్లు లైటింగ్ ఎక్కువగా కావాలి. ఏ షాటూ మూడు సెకన్లకు తక్కువగా ఉండకూడదు. ఒక వేళ ఉంటే జెర్క్ కనిపిస్తుంది. జెర్క్ వస్తే సినిమా పూర్తయ్యేటప్పటికి ప్రేక్షకుడు అలసిపోతాడు. ఈ విషయం మేం ఎడిటింగ్ పూర్తి చేశాక తెలిసింది. అందుకే టుడికి, త్రీడీకి సమన్వయం కుదుర్చుకుంటూ మొత్తం సినిమాను మరలా రీ ఎడిట్ చేశాం. చెప్పుకుంటూ పోతే ఇలాంటి సాంకేతిక అంశాలు చాలానే ఉంటాయి. సినిమా సెట్స్‌మీదకు వెళ్లకముందు స్టోరీబోర్డ్‌తో సహా సిద్ధంగా ఉంటేనే త్రీడీలో చేయడం సాధ్యమవుతుంది. లేకుంటే టైమ్, డబ్బు ఎక్కువగా వృథా అవుతుంది.'' అన్నారు.


Click it and Unblock the Notifications












