ఎమ్మెల్యే ట్రైలర్ టాక్ : నేనింకా రాజకీయం మొదలుపెట్టలేదు..ఒక్కొక్క డైలాగ్ చెబుతుంటే!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం మార్చి 23 న విడుదలకు సిద్ధం అవుతోంది. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ విడుదల చేసింది.
దర్శకుడు ఉపేంద్ర మాధవ్ అన్ని కమర్షియల్ అంశాలని పకడ్బందీగా ఎమ్మెల్యే చిత్రంలో పొందుపరిచినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ట్రైలర్ మొత్తం ఆకట్టుకునే పంచ్ డైలాగులు, ఫాన్స్ మెప్పించే యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.
నేనింకా రాజకీయం మొదలుపెట్టలేదు.. మొదలుపెడితే మీరు చేయడానికి ఏమీ మిగలదు అంటూ కళ్యాణ్ రామ్ చెబుతున్న డైలాగులు ఫాన్స్ ని మెప్పించే విధంగా ఉన్నాయి. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు.. అదే చదువు ఇస్తే ఎలాగైనా బ్రతుకుతారు.. అంటూ కాజల్ చెబుతున్న డైలాగ్ కూడా బావుంది.
వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఏ మామగారైనా పిల్లతో పాటు కట్నం ఇస్తారు.. మా మామగారు మాత్రం బామ్మర్దిని ఇచ్చారు అంటూ అమాయకంగా చెప్పడం హాస్యం పండించే విధంగా ఉంది. మొత్తంగా ఈ చిత్రం ఎమ్మెల్యే చిత్రంపై అంచనాలు పెంచే విధంగానే ట్రైలర్ ఉందని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











