కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు, అంతా ఆయనే చేయించారు: కళ్యాణ్ రామ్
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ, విద్యా బాలన్, కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయుకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలిసి చిత్ర బృందం సోమవారం రామారావు పుట్టిన నిమ్మకూరు సందర్శించారు.
నిమ్మకూరులో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు బసవతరాకం-రామారావు విగ్రహాలను బాలయ్య, విద్యాబాలన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ అంటే పట్టుదల, ఎన్టీఆర్ అంటే పౌరుషం, ఎన్టీఆర్ క్రమశిక్షణ. ఇదంతా ఈ నేల ఇచ్చిన గొప్పదనమని తెలిపారు.

ఈ నేలకు రుణపడి ఉంటాం
నిమ్మకూరుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఇది మా సొంతూరు. మాకు ఎంతో ఇచ్చిన ఊరు. సినిమా విడుదల ముందు అందరినీ కలుద్దామని ఇక్కడకు రావడం జరిగింది. మాకు విజయం చేకూరుతుందనే గట్టినమ్మంతో ఉన్నామని తెలిపారు.

ఆయన కుటుంబంలో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు
ఎన్టీఆర్ గారి జీవితం అందరికీ తెలుసు. కానీ ఆయన కుటుంబంలో ఏం జరిగింది? ఆయన భార్య అంటే మా నాయనమ్మగారు ఆయన జీవితాన్ని ఎంత ప్రభావితం చేశారు, ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషించింది, వారి పిల్లలు పక్కనుంటూ వారిని ఎలా కాపాడుకుంటూ వచ్చారు. ఇలాంటి అంశాలతో ‘ఎన్టీఆర్' చిత్రం ఉంటుంది. ఇది పెద్ద హిట్టవుతుంది అనడంలో డౌటే లేదని కళ్యాణ్ రామ్ తెలిపారు.

అంతా ఆయనే చేయించారు
జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1983లో తాతగారు అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ తిరిగి అదేరోజు సినిమా వస్తుంది. ఇదంతా ఆయన పై నుంచి చేయించారనిపిస్తుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

బాధ్యతగా ఫీలై తీసిన సినిమా
ఇంత గొప్ప సినిమా కష్టంతో కాకుండా ఇష్టంతో, ఒక బాధ్యగా ఫీలై తీయాలి. అందుకేనేమో ఎప్పుడో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్ సినిమా సమయంలో బేనర్ స్థాపిద్దామనుకున్న బాబాయ్ నిర్ణయం వాయిదా పడుతూ చివరకు తాతగారి సినిమాతో మొదలైంది. ఇదంతా పై నుంచి ఆయన చేయించిందే. ఈ సినిమాకు కృషి చేసిన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ ధన్యవాదాలు.. అంటూ కళ్యాణ్ రామ్ తన ప్రసంగం ముగించారు.


Click it and Unblock the Notifications











