కళ్యాణి ఛాప్టర్ ఓపెన్ అయ్యేది సంక్రాంతికే...
శేషు, దొంగోడు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి చిత్రాలతో తనకంటూ పేరు తెచ్చుకున్న కళ్యాణి పెళ్లి చేసుకుని నటనకు కాస్త దూరమైంది. మళ్ళీ ఇప్పుడు ఛాప్టర్-6 అనే టైటిల్ తో తన భర్త సూర్య కిరణ్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించింది. ప్రేమని వివిధ రంగులతో పోలుస్తూ ఈ చిత్రం రూపొందింది. ప్రేమ పుట్టుకను నీలి రంగులోనూ, ప్రేమలోని పవిత్రతను తెలుపురంగులోనూ, ప్రేమలోని వైరుధ్యాన్ని నలుపు రంగులోను, ప్రేమలోని బాధను లేత పసుపు రంగులోనూ, ప్రేమాన్వేషణను నారింజ రంగులోను, ప్రేమ విజయాన్ని ఎరుపు రంగులోనూ అభివర్ణిస్తూ... వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం 'చాప్టర్'6'. హీరోయిన్ కళ్యాణి నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రం ద్వారా బాల, సోనియా సూరి ఈ చిత్రం హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
నిర్మాణం పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి కళ్యాణి మాట్లాడుతూ-" మనసుకు నచ్చడంతో ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాను. రెగ్యులర్ ప్రేమకథలకు ఇది పూర్తి భిన్నమైన కథ అంటోంది. ప్రేమలోని ఆరు రకాల భావోద్వేగాలను ఆద్యంతం ఆసక్తికరంగా ఇందులో చూపించాం. ఫిబ్రవరి 14న ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి, దేశంలోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరిపాం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మా శ్రీవారు సూర్యకిరణ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఒక నవల చదువుతున్న అనుభూతిని కలిగించే చిత్రమిది. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. సినిమా పూర్తయింది. ఈ వారంలోనే తొలికాపీ కూడా వస్తుంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని చెప్తోంది.


Click it and Unblock the Notifications











