నాలుగేళ్ల తర్వాత.... కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ మళ్లీ మొదలైంది!
మధ్యలో ఆగిన కమల్ హాసన్ మూవీ ‘విశ్వరూపం 2’ షూటింగ్ మళ్లీ మొదలైంది.
Recommended Video

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' 2013లో విడుదలై సూపర్ హిట్టయింది. అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక వివాదాలు నెలకొన్నాయి. అప్పటి పరిస్థితులు సినిమా విడుదలకు అడ్డంకిగా మారడంతో కమల్ హాసన్ తీవ్ర మనస్థాపానికి గురై దేశం విడిచి వెళ్లిపోతాను అని స్టేట్మెంట్స్ ఇచ్చే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.
'విశ్వరూపం' చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి సీక్వెల్ 'విశ్వరూపం 2' కూడా ప్రారంభించారు. అయితే పలు కారణాలతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

అఫీషియల్‌గా ప్రకటించిన చిత్ర యూనిట్
'విశ్వరూపం 2' చిత్ర షూటింగ్ నాలుగేళ్ల తర్వాత తిరిగి సోమవారం(నవంబర్ 27) ప్రారంభమైంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. వారం రోజుల్లో సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

వచ్చే ఏడాది సినిమా రిలీజ్
షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 28, 2018లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పార్ట్ 2 ఎలా ఉండబోతోంది?
‘విశ్వరూపం' మొదటి భాగంతో పోలిస్తే పార్ట్ 2 మరింత ఎమోషనల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే గతంలో మాదిరిగా ఈ చిత్రంలోనూ వివాదాలు ఉంటాయా? లేదా? అనేది సినిమా విడుదలైతేగానీ చెప్పలేం.

పాత వారితో పాటు వహీదా రెహమాన్ కూడా
విశ్వరూపం 2లో మొదటి భాగంలో నటించిన కమల్ హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ లాంటి వారితో పాటు వహీదా రెహమాన్ కూడా నటిస్తున్నారు.

సినిమాపై భారీగా అంచనాలు
ఈ సినిమాను కమల్ హాసన్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కింస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. గిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











