విశ్వరూపంపై బ్యాన్: కోర్టుకెక్కిన కమల్ హాసన్
చెన్నై: 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించడంపై ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు కమల్ హాసన్ కోర్టుకెక్కారు. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో గురువారం పిటీషన్ దాఖలు చేసారు. సెన్సార్ అయిన సినిమాను ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు.
అంతకు ముందు ఆయన ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ తన మద్దతు దారులకు బహిరంగ లేఖ రాసారు. చిత్రంపై నిషేదం విధించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇలా చేయడాన్ని సాంస్కృతిక ఉగ్రవాదంగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడటం సమంజసం కాదన్నారు.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.
తమిళనాడులో ముస్లిం సంఘాల ఆందోళన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ సినిమాపై 15 రోజుల నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాపై కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ఏ సీన్లు కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తెలుగు నాటు నిషేదం లేక పోయినా.... విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











