నేనేమీ నేరం చేయడం లేదు : కమల్ హాసన్
చెన్నై : కమల్‌హాసన్ స్వీయదర్శకత్వంలో నటిస్తూ తీవ్రవాదం నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలు. 'విశ్వరూపం' చిత్రం డిటిహెచ్ ద్వారా నేరుగా టీవీల్లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమైన సంగతి తెలిసిందే. తన ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్న 'తమిళనాడు సినిమా థియేటర్స్ అసోసియేషన్'పై కమల్ నిప్పులు చెరిగారు. తానేమీ నేరం చేయడం లేదని, సినిమాను ఎలాగైనా రిలీజ్ చేసుకునే సర్వహక్కులు తనకు ఉన్నాయని తేల్చి చెప్పారు.
డిటిహెచ్ రిలీజ్ ద్వారా తాను సరికొత్త విధానానికి నాంది పలుకుతున్నానని, ఇది మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. డిటిహెచ్ రిలీజ్ ద్వారా జనాలు థియేటర్లకు రావడం మానేస్తారు అనే వాదనను కమల్ హాసన్ కొట్టి పారేసారు. సినిమా థియేటర్లలో విడుదల కావడానికి 12 గంటల ముందే ఎయిర్ టెల్ డిటిహెచ్ ద్వారా టీవీల్లో విడుదల చేస్తున్నారు. జనవరి 10వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఈషో ప్రదర్శించనున్నారు. మరికొన్ని డిటిహెచ్ సంస్థలు కూడా విశ్వరూపం డీల్ పై ఆసక్తి చూపుతున్నారు.
విశ్వరూపం సినిమాను థియేటర్లో విడుదలకు ముందు టీవీల్లో చూడానుకునే వారు రూ. 1000(ఒకసారి చూడటానికి) చెల్లించి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఈ సినిమా ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ సౌండ్ టెక్నాలజీని భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటివరకు హాలీవుడ్‌లో ఒకేఒక్క చిత్రానికి ఉపయోగించిన '3డి అరో సౌండ్' అనే సరికొత్త శబ్ధ పరిజ్ఞానాన్ని 'విశ్వరూపం' సినిమాకు ఉపయోగించారు. ఇలాంటి మరెన్నో విశేషాల సమాహారంగా తెరకెక్కుతున్న 'విశ్వరూపం' భారతీయ సినిమాని ఎంత వరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











