కమలినీ - ఇక సినిమాలకు స్వస్తి?
ఆనంద్ చిత్రంతో అఖిలాంధ్ర ప్రేక్షకులకు చేరువై, ఉత్తమ నటిగా కూడా ప్రభుత్వ నంది పురస్కారాన్ని అందుకున్న బెంగాలీ భామ కమిలినీ ముఖర్జీ అంతలోనే సినిమాలకు స్వస్తి చెప్పబోతోందా? ఇటీవల ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు కమలినీ అవునని జవాబు చెప్పింది. తమిళంలో కమల్ హాసన్ సరసన వెట్టైయాడు - వెలియాడు (తెలుగులో మగధీర) చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన కమలిని ముఖర్జీ కమల్‌తో నటించాక ఇంక సినిమాలు చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. చిన్ననాటి నుండి కమల్ హాసన్ తన అభిమాన నటుడని, ఆయనతో కలిసి నటించడంతో తన కల నెరవేరిందని చెప్పింది. వెట్టైయాడు - వెలియాడు చిత్రంలో తన పాత్రకు మంచి పేరొచ్చిందని, అనేకమంది ప్రశంసిస్తూ ఫోన్లు, సందేశాలు పంపిస్తున్నారని కమలినీ చెప్పింది. సినిమాల్లో అవకాశాల కోసం ఇంతమంది హీరోయిన్లు పరితపిస్తుంటే మరి కమలినీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
ఆనంద్, గోదావరి చిత్రాల విజయాలతో తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇంక నటించాలన్న ఆసక్తి లేదు. నిజానికి నా కెరీర్ వాణిజ్య ప్రకటనల్లో మోడలింగ్‌తో మొదలైంది. నటినయ్యాక యాడ్ ఫిలింస్ చేయలేకపోతున్నాను. మళ్లీ మోడలింగ్‌లోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది కమలినీ.
నటిగా బిజీగా ఉండి కూడా అటు మోడలింగ్‌లోనూ రాణిస్తున్న ఆసిన్, జ్యోతిక లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా అన్న ప్రశ్నకు - కమలినీ ఎవరి విషయమో నాకు తెలియదు.. నాకు మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరమవ్వాలనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది. తెలుగులో ఒక మంచి నటి ఉందని అనుకునే తరుణంలో కమలినీ నిర్ణయం అనేకమందిని నిరాశపర్చవచ్చు. అయితే, అభిమానులు, సినీవర్గాల ఒత్తిడి వల్ల కమలినీ నిర్ణయం మారాలని ఆశిద్దాం!


Click it and Unblock the Notifications