కంగనా అర్హురాలు కాదు, మూర్ఖంగా ప్రవర్తించింది: ‘మణికర్ణిక’ వివాదం బయటపెట్టిన క్రిష్
ఝాన్సీ రాణి లక్ష్మీభాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మణికర్ణిక' జనవరి 25న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ చిత్రం మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయినప్పటికీ... మధ్యలో ఆయన తప్పుకోవడం, తర్వాత దర్శకత్వ బాధ్యతలు కంగనా రనౌత్ చేపట్టడం తెలిసిందే.
క్రిష్ ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి ఉన్నట్టుండి తప్పుకోవడానికి కారణం కంగనాతో జరిగిన గొడవే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా విడుదల వరకు ఈ వివాదంపై మౌనం వహించిన క్రిష్ తాజాగా ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టారు.

జూన్‌లోనే ఎడిటింగ్ పూర్తయింది
క్రిష్ మాట్లాడుతూ... సినిమా మొత్తం షూటింగ్, ఎడిటింగ్ గతేడాది జూన్ మాసంలోనే పూర్తయింది. సినిమాలోని అందరూ తమ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. కంగనా రనౌత్ ‘మెంటల్ హై క్యా' షూటింగులో భాగంగా లండన్లో ఉండటం వల్ల ఆమె డబ్బింగ్ పూర్తి చేయలేదని తెలిపారు.

తనకు నచ్చింది కానీ, నిర్మాతకు నచ్చలేదన్నారు
లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కంగనా సినిమా చూసి నచ్చిందని చెప్పారు. కొన్ని చిన్న మార్పులు చేయాలని కోరారు. అది మార్చాలి, ఇది మార్చాలి... ఇది తగ్గించాలి, అది తగ్గించాలి అన్నారు. నిర్మాత కమల్ జైన్‌కు సినిమా నచ్చలేదని నాతో ఆమె చెప్పారు అని క్రిష్ గుర్తు చేసుకున్నారు.

అలా చేయడం చరిత్రను వక్రీకరించడమే అని చెప్పాను
ప్రసూన్ జోషి, మరికొందరితో చర్చించిన తర్వాత కొన్ని మార్పులు చేయడానికి, ఆరు రోజుల రీ షూట్ చేయాలని నిర్ణయించాం. అయితే కంగనా సడెన్‌గా వచ్చి సోనూ సూద్ పోషించిన సదాశివరావు పాత్రను ఇంటర్వెల్ పాయింటులోనే చంపేయాలని సూచించారు. అయితే అలా చేయడం చరిత్రను వక్రీకరించడమే అని నేను వాదించాను... అని క్రిష్ తెలిపారు.

చాలా పెద్ద గొడవ జరిగింది, నిర్మాతలు ఆమె వైపే
సోనూ సూద్ పాత్ర విషయంలో మా మధ్య చాలా పెద్ద వాదన జరిగింది. అయితే నిర్మాతలు కంగనా వైపే ఉన్నారు. చిన్న చిన్న మార్పులు చేయడానికి నేను ఒప్పుకుంటాను కానీ... సోనూ సూద్ పాత్రలో మార్పు చేసి నేను డైరెక్ట్ చేయలేను అని చెప్పాను. దీంతో నిర్మాత కమల్ జైన్... దాన్ని కంగనా డైరెక్ట్ చేస్తుందని సమాధానం ఇచ్చారు.

సోనూ తప్పుకోవడానికి కారణం అది కాదు, కంగనా అబద్దం చెప్పింది
సోనూ సూద్ సినిమా నుంచి తప్పుకోవడంతో మహిళా డైరెక్టర్‌తో చేయడం ఇష్టం లేక తప్పకున్నారని కంగనా ప్రచారం చేసింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. సినిమలో ఆయన పాత్ర 100 నిమిషాలు ఉంది. దాన్ని 60 నిమిషాలకు కుదిస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అందుకే ఆయన తప్పుకున్నారు, దీంతో ఆ పాత్రను వేరొకరితో చేయించారని అని క్రిష్ వెల్లడించారు.

ఇంకా చాలా మార్పులు చేశారు
ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి తాత్యాతోపేగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అతడిని పాత్ర నిడివి కూడా చాలా వరకు తగ్గించారు. కాశీబాయి(ప్రజాక్తా మాలి) పాత్ర చాలా సన్నివేశాల్లో కట్ చేశారు. ఎందుకు ఇలాంటి మార్పులు చేశారో అర్థం కాలేదు. అవి ఉంటే సినిమా ఇంకా బావుండేది అని క్రిష్ వెల్లడించారు.

మూర్ఖంగా ప్రవర్తించింది
చాలా విషయాల్లో కంగనా మూర్ఖంగా ప్రవర్తించింది. జీ స్టూడియోస్ వారికి సినిమా నచ్చలేదని, ఇది భోజ్‌పురి మూవీలా ఉందని తనను నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుడు నేను నవ్వుతూ... నా పని తీరు గురించి ప్రజలకు తెలుసు అన్నాను. ఆమె తన తీరు మాత్రం మార్చుకోలేదన్నారు.

నా పేరు కూడా మార్చారు
సినిమా టైటిల్స్‌లో నా పేరు రాధాకృష్ణ జాగర్లమూడి అని వేశారు. నేను గత సినిమాల్లో ఎప్పుడూ పేరు అలా వేసుకోలేదు. క్రిష్ జాగర్లమూడి అని మాత్రమే వేసుకున్నాను. ఈ విషయం నేను వారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని మార్చాలని కోరగా... కంగనా నాతో మళ్లీ రూడ్‌గా ప్రవర్తించింది. సోనూ సూద్ పాత్ర విషయంలో నువ్వు మాకు సహకరించలేదు, ఇపుడు నీ అవసరం కాబట్టి వచ్చావు అని వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

ఆమె అందుకు అర్హురాలు కాదు
సినిమా డైరెక్షన్లో ఫస్ట్ క్రిడిట్ తన పేరు వేసుకుని... నాకు సెకండ్ క్రెడిట్ ఇచ్చారు. మరొకరి క్రెడిట్ ఆమె తీసుకుని ఎలా నిద్రపోతోందో అర్థం కావడం లేదు. అందుకు ఆమె అర్హురాలు కాదు అని క్రిష్ అన్నారు.


Click it and Unblock the Notifications











