క్రిష్ జాగర్లమూడి వాట్సాప్ చాట్ లీక్ చేసిన కంగనా సోదరి.. ఇదీ సంగతి!
'మణికర్ణిక' వివాదంలో దర్శకుడు క్రిష్ మీడియా ముందుకు వచ్చి నిజాలు బయట పెట్టడంతో కంగనా రనౌత్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. ఈ ప్రాజెక్టును ఆమె ఎలా చేతుల్లోకి తీసుకుంది? తాను బయటకు రావడానికి గల కారణాలు ఏమిటి? కంగనా చేసిన మార్పులు ఏమిటి.. ఇలా అన్ని విషయాలపై క్రిష్ ఓపెన్ అయ్యారు.
క్రిష్ వాదన విన్న తర్వాత చాలా మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. 70 శాతం సినిమా చిత్రీకరించిన ఆయనకు తగిన గుర్తింపు చిత్ర బృందం ఇవ్వలేదని, కేవలం 30 శాతం డైరెక్షన్(రీషూట్) చేసి సినిమా మొత్తం తానే చేసినట్లుగా కంగనా చెప్పుకోవడం సరైంది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కంగనా సోదరి రంగోలి... క్రిష్, నిర్మాత కమల్ జైన్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ లీక్ చేయడం చర్చనీయాంశం అయింది.
ఇదే సాక్ష్యం... అంటూ వాట్సాప్ చాట్ లీక్
క్రిష్ చేస్తున్న ఆరోపణలపై కంగనా రనౌత్ సోదరి రంగోలి స్పందిస్తూ... ‘డిసెంబర్ 6వ తేదీన సినిమా చూడాలని కంగనా క్లియర్‌గా క్రిష్‌ను అడిగింది. అందుకు ఈ వాట్సాప్ చాట్ సాక్ష్యం' అంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ ఆమె షేర్ చేశారు.
ఈ చిత్రంలో భాగం కావాలని క్రిష్‌ను కోరడం జరిగింది
రంగోలి మరో ట్వీట్లో... కంగనా, విజయేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయట పెట్టింది. డిసెంబర్ 4న రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు పంపిన సందేశంలో క్రిష్ గురించి మాట్లాడిందని, అతడిని సినిమాలో భాగం కావాలని కోరినట్లు తెలిపారు.

క్రిష్ వాదన ఏమిటంటే...
సినిమాలో సదాశివరావు పాత్ర విషయంలో చరిత్రను వక్రీకరించే విధంగా మార్పులు కోరడంతోనే తాను ఒప్పుకోలేదని, దీంతో నిర్మాతలు కంగనా రనౌత్ దర్శకత్వం చేస్తుందంటూ ప్రపోజల్ తెచ్చారని, అందుకే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు... క్రిష్ వాదిస్తున్నారు.

కంగనా చేసిన మార్పులపై క్రిష్
సినిమా మొదటి భాగంలో 20% నుంచి 25%... రెండో భాగంలో 10% మార్పులు చేశారని... మిగతా సినిమా అంతా కూడా తాను డైరెక్ట్ చేసిందనే ఉందని, అయితే దర్శకుడిగా తనకు ఫస్ట్ క్రెడిట్ ఇవ్వకుండా, తన పేరు ఎవరూ గుర్తు పట్టకుండా మార్పు చేసి వేశారని క్రిష్ అసహనం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











