కరణ్ జోహర్ చేతికి జెర్సీ రీమేక్ హక్కులు... రికార్డు ధరకు సొంతం.. హీరో ఎవరంటే?
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ చారిత్రాత్మక నేపథ్యంతో తఖ్త్ అనే చిత్రంపై బిజీగా ఉన్నారు. ఆ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తూనే తెలుగులో విజయవంతమైన జెర్సీ సినిమాను రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. నేచురల్ స్టార్ నానీ, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ చిత్రం అన్నివర్గాలను విశేషంగా ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ ఫుల్ మూవీ హక్కులను ఇటీవల భారీ రేటుకు కరణ్ జోహర్ దక్కించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే

నాని పాత్రలో షాహీద్ కపూర్
ఇక జెర్సీ హిందీ రీమేక్‌లో షాహీద్ కపూర్‌ను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో నాని పోషించిన పాత్రను షాహీద్ అయితే బాగుంటుందని కరణ్ భావిస్తున్నారట. త్వరలోనే నటీనటులు, సాంకేతిక వర్గాల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారనేది తాజా సమాచారం. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

భావోద్వేగమైన స్పోర్ట్స్ డ్రామాగా
జెర్సీ సినిమా రెగ్యులర్ క్రీడా మూవీ కాకుండా ఓ భావోద్వేగమైన సినిమాగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచే కాకుండా సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. నాని నటన మరో స్థాయికి తీసుకెళ్లగా, శ్రద్ధా శ్రీనాథ్ పెర్ఫార్మెన్స్ అదనపు ఆకర్షణగా మారింది.

బంధాలు, అనుబంధాలతో
జెర్సీ చిత్రంలో కథ, కథనాలు బలంగా మారాయి. భావోద్వేగమైన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతిభను చాటుకొన్నారు. అద్భుతమైన కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. జాతీయ స్థాయి ఎలివేషన్ ఈ కథలో ఉండటంతో కరణ్ జోహర్ దృష్టి పడింది.

రికార్డు ధరకు జెర్సీ మూవీ హక్కులు
జెర్సీకి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించడంతో బాలీవుడ్ వర్గాలు హక్కులను పొందడానికి పోటీ పడ్డారు. అయితే కరణ్ జోహర్ భారీ ఆఫర్ ఇచ్చి హక్కులను సొంతం చేసుకొన్నారనేది సమాచారం. అయితే రికార్డు స్థాయిలో చెల్లించిన మొత్తం ఎంత అనేది బయటకు పొక్కలేదు. కానీ ఫ్యాన్సీ రేటు మాత్రం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











