ఎన్టీఆర్ ఎవరికి దేవుడు.. ఏ వర్గానికి దేవుడు.. విగ్రహంపై కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు
నటి కరాటే కల్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ నెల 28న నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణకు నటి కరాటే కళ్యాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు రూపంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపడుతున్నారు. ఎన్టీఆర్ ఎవరికి దేవుడు ఏ వర్గానికి దేవుడో చెప్పాలంటూ ఆమె కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వివారాల్లోకి వెళ్తే...
ఏపీలో అతిథిగా రజనీకాంత్:తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆరాధ్యదైవంగా కొలిచే నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు సిద్దం అవుతున్నారు. ఏపీలో ఇటీవలే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఎన్టీఆర్‌కు ఆహ్వానం:ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. శతజయంతి ఉత్సవాలకు ఆయన కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు.కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్‌ల నివాసాలకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

వివాదంలో ఎన్టీఆర్ విగ్రహం:ఇక ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. తారక రామారావు విగ్రహాన్ని శ్రీకృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయడంపై నటి కరాటే కల్యాణితో పాటు, యాదవుల సంఘాల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. దీనిపై కరాటే కల్యాణి మాట్లాడుతూ..ఎన్టీఆర్ ఎవరికి దేవుడు.. ఏ వర్గానికి దేవుడు..ఎవరి కోసం ఆయన్ను దైవాన్ని చేస్తూన్నారు...ఎవరిని మెప్పించడానికి ఇదింతా చేస్తున్నారని ప్రశ్నించారు. దైవానికి , మానవునికి తేడా ఉందా లేదా... మానవుడు దేవుడైతే.. ఇంకా మనం దేవుళ్లని పూజించడం ఎందుకని.. మన ఫొటోలను పెట్టుకుని మనకు మనమే పూజించుకోవచ్చు కదా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

అమ్మోరు వేషం వేస్తానంటూన్న కరాటే కల్యాణి:ఎన్టీఆర్‌గారంటే నాకెంతో గౌరవం, భక్తి ఉన్నాయని... ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే నాకు ఎటువంటి సమస్య లేదు.కాకపోతే ఆ విగ్రహం శ్రీకృష్ణుడి అవతారంలో ఉండటంపైనే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము. శ్రీకృష్ణుడు వేషం వేసిన ఎన్టీఆర్ దేవుడైతే.. నేను కూడా అమ్మోరు వేషం వేసి దేవత అవుతానంటూ కామెంట్ చేశారు. ఏ రాజకీయ లబ్ధి కోసం ఎన్టీఆర్‌ను దేవుడును చేస్తున్నారని ప్రశ్నించారామె. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ఱుడు రూపంలో ఏర్పాటు చేయడంతో హిందువుల మనోభాలు దెబ్బతిన్నాయని..ముఖ్యంగా యాదవులందరు కూడా బాధపడుతున్నారని కరాటే కల్యాణి వెల్లడించారు. దయచేసి ఇలాంటి పనులు చేయడం ఇప్పటికైనా ఆపేయాలని ఓ వీడియోను విడుదల చేశారు.

కరాటే కల్యాణిపై మా అధ్యక్షుడు ఆగ్రహం.. క్రమశిక్షణ చర్యలు:అయితే కరాటే కల్యాణిపై మా అసోసియేషన్ గుర్రుగా ఉంది. ఎన్టీఆర్ విగ్రహంపై వివాస్పద వ్యాఖ్యలు చేసిన ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు పంపించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని .. వాటిపై మూడో రోజులలో వివరణ ఇవ్వాలని మంచు విష్ణు ఆమెకు పంపిన నోటీసులో ఆదేశించారు. గత మా అసోసియేషన్ ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్‌లోనే కరాటే కళ్యాణి పోటీ చేశారు. ఇలాంటి సమయంలో కరాటే కల్యాణిపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఆసక్తి సినీవర్గాల్లో నెలకొంది.


Click it and Unblock the Notifications











