100 కోట్లు12 డేస్, తొలి సౌత్ మూవీ ఇదే: మురుగదాస్
హైదరాబాద్: విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం కత్తి దక్షిణాదిన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లో 100 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకుంది. అతితక్కువ కాలంలో ఈ ఖ్యాతిని సొంతం చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం. విడుదలైన తొలిరోజు నుంచి ఇప్పటివరకూ ఈ చిత్రం ఇండియాలో 80.5 కోట్లు, ఓవర్సీస్‌లో 20.2 కోట్ల వసూళ్లను సాధించినట్లు దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికీ ఆయన సినిమా చూసి నో చెప్పడంతో ఇక డబ్బంగ్ వెర్షన్ తెలుగులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ 21న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాట ఓపెనింగు రోజు రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు విజయ్ నటించిన తుపాకి చిత్రం తెలుగులో కూడా మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ కావడం కూడా కలిసొచ్చే అంశం. ‘కత్తి' విడుదల ముందు అనేక కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం దీపావళికి విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి కోర్టు కష్టాలు మొదలయ్యాయి.
సినిమాలో 2జి స్ప్రెక్ట్రమ్ స్కాం ప్రస్తావన ఉండటంతో మధురైకి చెందిన లాయర్ రామసుబ్రహ్మణ్యం కేసు వేసారు. 2జి స్ప్రెక్ట్రమ్ కేసు ఇంకా విచారణ దశలో ఉండగా సినిమాలో ఆ అంశాన్ని లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్, సినీ నిర్మాణ సంస్థలపై కేసు వేసారు.
గతంలో విజయ్ హీరోగా చేసిన ‘ఖుషీ' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.‘కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.


Click it and Unblock the Notifications











