మరో తెలంగాణ ఉద్యమ సినిమా ‘పోరు’
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న మరో సినిమా 'పోరు'. ఫర్ యు-ఫర్ మి-ఫర్ అస్ అనేది సబ్ టైటిల్. దక్కన్ సినిమా బేనర్ పై కుమార్ ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్లాప్ కొట్టి ప్రారంభించారు.
తొలి సన్నివేశంలో జేఏసీ నాయకులు, రాజకీయ ప్రముఖులు, ఉద్యమ నేతలు అమర వీరులకు నివాళులు అర్పించే దృశ్యాలను చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్న శ్రీనివాసరెడ్డి, ఐఎన్‌జివోఎస్ అధ్యక్షుడు దేవి ప్రసాద్, టిఎన్జీఓఎ అధ్యక్షుడు స్వామిగౌడ్, టిడిఎఫ్ అద్యక్షుడు డిపి రెడ్డి, తేరవే అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్, అందెశ్రీ, రసమయి బాలకిషన్, ప్రొ. ఎస్వీ సత్యానారాయణ, డాక్టర్ లక్ష్మణ్, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, ఓయూ జేఏసీ నాయకులు పిడమర్తి రవి, మందాల భాస్కర్, దుర్గం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు కుమార్ ఖన్నా మాట్లాడుతూ...తెలంగాణ ప్రజల మనోభావాలకు, ఆకాంక్షలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ పూర్తి స్థాయి తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో ఈచిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. మన తెలంగాణలో కళాకారులు లేరనే బ్రమను తుడిచేయడం కోసం మేం మా శక్తియుక్తులను కూడగట్టి ఈ ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగానే 'దక్కన్ సినిమా' వేదికను తీసుకొస్తున్నామని తెలిపారు.
తెలంగాణ పది జిల్లాల్లో పర్యటనలు చేసి తమ 'పోరు' చిత్రానికి కళాకారులను ఎంపిక చేశామని, తెలంగాణపై జరుగుతున్న సాంస్కృతిక దాడి భయంకరమైనది అందుకే దాన్ని ఎదుర్కొనే ప్రయత్నమే ఈ 'పోరు' సినిమా అని నటుడు,నిర్మాత చేరణ్ తెలిపారు.
ఈ చిత్రంలో చేరణ్, ప్రణీత్ రెడ్డి, రమేష్, రామిరెడ్డి, క్రిషాంక్, సుష్మారెడ్డి, పరమేశ్వరి, చవ్వా వెంకట్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మెగా రవీందర్, అజయ్ కుమార్, లింగన్న, కామల్ల అయిలయ్యలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సాంకేతిక విభాగంలో.... పర్యవేక్షణ: రమణ.జె, కో-డైరెక్టర్స్: సుదీర్ కుమార్, దాసరి సుందర్, అసిస్టెంట్ డైరెక్టర్స్: ఋషీ కృష్ణ, కొడి చంద్రకిరణ్, 4డి శివాజీ, అబ్దుల్ రఫీ, ఓయు రాజు, చరణ్, నిర్మాత: చేరణ్, దర్శకత్వం: కుమార్ ఖన్నా.


Click it and Unblock the Notifications












