జైబోలో తెలంగాణ షూటింగులో కెసిఆర్, ఈ నెలలోనే విడుదల
శంకర్ దర్శకత్వం వహిస్తున్న జై బోలో తెలంగాణ సినిమా షూటింగులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పాల్గొన్నారు. ఆయనను శంకర్ డైరెక్ట్ చేశారు. తెరాస కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించే దృశ్యాన్ని కెసిఆర్‌పై మంగళవారం చిత్రీకరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కొన్నేళ్లుగా కెసిఆర్ నడిపిస్తున్నారని, తెలంగాణ పోరాటం చేస్తున్నవారిని సినిమాలో భాగస్వాములను చేస్తున్నామని, ఇందులో భాగంగానే కెసిఆర్‌ను కూడా భాగస్వామిని చేశామని శంకర్ వివరించారు. ఈ నెల 26 లేదా 28వ తేదీల్లో సినిమాను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సినిమా విడుదలకు థియేటర్లు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. సినిమా ఇంకా సెన్సార్‌కు వెళ్లలేదని, సెన్సార్‌లో ఏవైనా సమస్యలు వస్తే మీడియా ముందుకు వస్తానని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం చేసిన త్యాగాలను, తెలంగాణ కోసం ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి చాటే ఉద్దేసంతో సినిమాను నిర్మించినట్లు ఆయన తెలిపారు. సినిమా ఆడియోకు అనూహ్యమైన స్పందన ఉందని, సినిమాలోని ఏడు పాటలకు వంద శాతం రేటింగ్ వచ్చిందని, అంతటి రేటింగ్ వచ్చిన సినిమా ఇదేనని ఆయన అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆడియోను ప్రజలు ఆదరిస్తున్నారని, తెలంగాణేతరులు కూడా పాటలను ఆస్వాదిస్తున్నారని ఆయన చెప్పారు. సంగీతానికి, సాహిత్యానికి తెలుగు ప్రజలు ప్రాధాన్యం ఇస్తారనేది ఆడియో మార్కెట్ ద్వారా తెలుస్తోందని ఆయన చెప్పారు. టికెట్ కొనుక్కుని కెసిఆర్ సినిమాను చూడబోతున్నారని శంకర్ చెప్పారు. పాట రాసినందుకు కెసిఆర్‌కు తాము రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











