నిఖితపై నిషేధాన్ని ఎత్తేసిన నిర్మాతల సంఘం...!
ఒత్తిడిలో వుండి అనారోగ్యానికి గురైన కథానాయిక నిఖితకు ఊరట లభించింది. ఆమెపై కన్నడ చిత్ర నిర్మాతల సంఘం విధించిన నిషేధం తొలగిపోయింది. ఆమెపై బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్టు నిర్మాతల సంఘం ఈ రోజు బెంగళూరులో ప్రకటించింది. కన్నడ నటుడు దర్శన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని, అతని సంసారంలో చిచ్చురేపిందంటూ నిర్మాతల సంఘం నాలుగు రోజుల క్రితం నిఖితను మూడేళ్ల పాటు నిషేదిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
నిఖితను కన్నడ చిత్ర పరిశ్రమ మూడేళ్ల పాటు నిషేధించడము దేశవ్యాప్తంగా సంచలమైంది. ఈ ఉదంతం ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. తారల వ్యక్తిగత విషయాల్లో నిర్మాతల సంఘం జోక్యం చేసుకోవడం అన్నది ఎంతవరకు సబబు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వ్యక్తిగతాన్ని వృత్తికి ముడిపెట్టి చూడడం న్యాయమేనా? అన్న అంశంపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిఖితకు పలువురి మద్దతు లభించింది. కన్నడ నటుడు దర్శన్ తో నిఖిత అక్రమ సంబంధం పెట్టుకుందన్న సాకుతో, ఆమెను నిషేధించడం ఆమెకున్న ప్రాధమిక హక్కుకు భంగం కలిగించడమేనని పలువురు విమర్శలకు గురిచేసింది.ఈ నేపథ్యంలో కన్నడ నటుల నుంచే కాకుండా పలు ప్రాంతాల నటుల నుంచి, స్వచ్చంద సంస్థల నుంచి నిరసనలు, ఆరోపణలు వ్యక్తమవడంతో నిర్మాతల సంఘం ఈ విషయంలో వెనక్కు తగ్గింది.


Click it and Unblock the Notifications











