శర్వానంద్ 'కో అంటే కోటి' కథేమిటి?
హైదరాబాద్: శర్వానంద్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'కో అంటే కోటి'. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఆవకాయ బిర్యాని ఫేమ్ అనీష్ కురువిల్లా దర్శకుడు. శర్వా ఆర్ట్‌స బేనర్‌పై మైనేని వసుంధరదేవి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు. ఈనెల 8న ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నారని, ఆయన చేతనే ఆడియో ఆవిష్కరణ జరుగనున్నట్లు సమాచారం.
చిత్రం కథ గురించి శర్వానంద్ మాట్లాడుతూ...''డబ్బుకు లోకం దాసోహం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. మనిషి డబ్బు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. పది రూపాయలు కలిసొస్తుందంటే ఏదైనా చేస్తాడు. అలాంటిది ఏకంగా రూ.కోటి వస్తుందంటే వదులుతాడా? అందుకే నోట్ల కట్టల వెంట ఓ యువకుడు పరుగులు పెట్టాడు. మరి ఆ రూ.కోటి అందుకొన్నాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''పూర్తి మాస్ యాక్షన్ చిత్రమిది. అన్ని కమర్షియల్ హంగులు జోడించిన కథాబలం ఉన్న సినిమా ఇది. పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. శ్రీహరి ఓ కీలకపాత్రలో సహజనటనతో కనిపిస్తారు. ఆయన నటన హైలైట్. సంగీతం అతిరథుల మధ్య ఈ 8న ఘనంగా రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అన్నారు. అలాగే ''శర్వానంద్ ఇప్పటి వరకూ ప్రేమకథలకే పరిమితమయ్యాడు. అతనిలోని యాక్షన్ కోణాన్ని చూపించే చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి. శ్రీహరి పాత్ర ఎంతో కీలకం'' అన్నారు.
జర్నితో మరో మారు ప్రూవ్ చేసుకున్న శర్వానంద్ ఈ చిత్రం తనకు కమర్షియల్ గా బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరగే కథ అని,రోడ్ మూవీ గా తెరకెక్కుతోందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట సిద్దార్ధతో అనుకున్నారు కానీ సిద్దార్ద డేట్స్ క్లాష్ రావటంతో శర్వానంద్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. కొంతమంది స్నేహితులతో కలిసి సొంతంగా ఓ బ్యానర్ ప్రారంభించి ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రం కథపై ఉన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శకుడు అనీష్ సైతం.. ఆవకాయ బిర్యాని తర్వాత డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే కావటం గమనార్హం. శేఖర్ కమ్ముల సహకారం కూడా ఉండనుందని తెలుస్తోంది.
ఇక శర్వానంద్ లేటెస్ట్ గా అల్లరి నరేష్ తో కలిసి చేసిన నువ్వా... నేనా చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్ చేస్తున్న చిత్రం ఇదే. అలాగే ఈ చిత్రం అనంతరం చేరన్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. కథ నచ్చాకే చిత్రం చేస్తానని,అందుకే ప్రాజెక్టులు లేటవుతున్నాయని శర్వానంద్ అంటున్నారు. జర్నీ వంటి చిత్రం తర్వాత చాలా ఆఫర్సే వచ్చినా కొత్త తరహా స్క్రిప్టుకోసం ఆగారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో 'జెకె ఎనుమ్ నన్బనిన్ వాళ్‌కై' అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











