అరుంధతి కథ వినగానే.. నా ప్రాణం ఇచ్చేస్తా సర్.. కోడి రామకృష్ణతో అనుష్క!
కోడి రామకృష్ణ అంటే తెలియని తెలుగు సినీ అభిమాని ఉండరు. 100కు పైగా చిత్రాలకు ఆయన దర్శత్వం వహించారు. శుక్రవారం రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో భాదపడుతున్న కోడి రామకృష్ణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. కోడి రామకృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోడి రామకృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలని ప్రముఖులంతా కొనియాడుతున్నారు.

అరుంధతి
కోడి రామకృష్ణ దర్శత్వంలో చివరగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం అంటే అరుంధతినే. అనుష్క టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో అప్పటివరకు గ్లామర్ హీరోయిన్ గా ఉన్న అనుష్క ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రం విజయాన్ని గుర్తు చేసుకుంటూ కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అంజి తర్వాత
అంజి చిత్రం తర్వాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అరుంధతి. అంజి చిత్రం నష్టాల్ని మిగిల్చింది. దీనితో అరుంధతి చిత్రంపై కాస్త ఎక్కువ కేర్ తీసుకున్నా. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి కథ వినిపించారు. దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేశాం. ఈ సారి ఎక్కువగా గ్రాఫిక్స్ ఉండడకూడని కూడా మేమిద్దరం సరదాగా అనుకున్నాము. అంతా రెడీ అయ్యాక హీరోయిన్ గా అనుష్కని అనుకున్నాం.

అనుష్క చేయలేదు అన్నారు
అనుష్కని హీరోయిన్ గా అనుకుంటున్న సమయంలో చాలా మంది స్నేహితులు సలహా ఇచ్చారు. అనుష్క గ్లామర్ హీరోయిన్. ఇది ఎమోషన్ తో కూడుకున్న పాత్ర. ఆ అమ్మాయి చేయలేదు అని అన్నారు. అందరూ అలాగే అంటుండడంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కూడా అదే అనుమానం కలిగింది. అనుష్క కాకుండా ఇంకెవరినైనా ట్రై చేద్దామా అని అన్నారు. నేను ఒక్కటే చెప్పా. అరుంధతి సినిమా చేస్తే అనుష్కతోనే చేయాలి. వేరే హీరోయిన్ తో చేయాలి అనుకుంటే కథ మొత్తం మార్చేయాలి అన్నాను. సరే నాక్కూడా అనుష్కపై నమ్మకం ఉంది అని శ్యామ్ అన్నారు.

ప్రాణం ఇచ్చేస్తా
వెంటనే అనుష్కకి కథ వినిపించాం. ఈ చిత్రంలో నువ్వు చేగలవో లేదో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాగా చేయాలి అని అన్నాను. నాకు కథ నచ్చింది.. ప్రాణం ఇచ్చేస్తాను సర్ అని అంది. అనుష్క కమిట్మెంట్ గురించి మాటల్లో చెప్పలేం. షూటింగ్ లో పాత్రలో లీనమైపోయి చాలా సార్లు కళ్ళు తిరిగిపడిపోయింది. మళ్ళీ లేచి షూటింగ్ కు రెడీ అయ్యేది. పదికేజిల కాస్ట్యూమ్స్ తో చాలా రోజులు షూటింగ్ చేశాం. దానికి తోడు ఎమోషనల్ గా ఉండే డైలాగులు. డైలాగులు నిత్యం ప్రాక్టీస్ చేస్తూ పాత్రలో లీనమైపోయి అనుష్క ఈ చిత్రాన్ని చేసింది.

అరచి చెప్పేవాడిని
కొన్ని డైలాగులు గట్టిగా అరచి చెప్పాలి. ఆ సమయంలో కొంత ఇబ్బంది పడింది. ఏం పర్వాలేదు.. మొదట నేను చెబుతాను.. ఆ తర్వాత నువ్వు రిపీట్ చేయి అని వినిపించేవాడిని. ఆతర్వాత అన్ని డైలాగులు నా కన్నా పవర్ ఫుల్ గా చెప్పేసింది అని కోడి రామకృష్ణ అన్నారు. సెట్ లో ఎక్కడ చూసినా డైలాగ్స్ చదువుతూ కనిపించేది. ఎక్కువ చదవద్దు మరచిపోతావు అని సరదాగా అనేవాడిని. లేదు సర్ ఈ డైలాగు ఎమోషనల్ గా చెప్పాలి అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా అని బదులిచ్చినట్లు అరుంధతి షూటింగ్ సంగతులని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











