‘బాద్ షా’లో నా పేరు లేదు, చాలా బాధపడ్డా: కోన వెంకట్
హైదరాబాద్: 'బాద్ షా' సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలైన సందర్బంలో అందులో నా పేరు లేదు. ఎందుకు తీసేసారో నాకు అర్థం కాలేదు. ఆ రోజు అందరినీ కాంటాక్టు చేసాను. ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఆ రోజు రాత్రంతా ఎంతో బాధ పడ్డాను. ఇంత బతికి ఇదా అనుకున్నాను. కానీ అది కావాలని చేసింది కాదని, ఫ్రింటింగ్ మిస్టేక్ వల్ల అలా జరిగిందని నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ దాన్ని సరి చేయించారు అని వెల్లడించారు స్టార్ రైటర్ కోన వెంకట్.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొందరు దర్శకులకు టాలెంట్ లేదని, రచయితల టాలెంట్‌ను తమ టాలెంట్‌గా చెప్పుకుంటున్నారని, రచయితలకు సరైన గుర్తింపు లేదని ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచనల ఆరోపణలు చేసిన కోన వెంకట్.... పెద్ద వివాదానికి, ఇండస్ట్రీలో దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోన వెంకట్ బుధవారం ఓ టీవీ ఛానల్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా 'బాద్ షా' పోస్టర్లో తన పేరు మిస్సయిన సందర్భాన్ని గుర్తు చేసారు. తన వ్యాఖ్యలపై రేగిన దుమారంపై స్పందిస్తూ.... తాను అందరు దర్శకులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, అలాంటి కొందరు దర్శకుడు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పానని తెలిపారు. నా పత్రికా ఇంటర్వ్యూ చూసిన చాలా మంది దర్శకులు నాకు ఫోన్ చేసి నన్ను సమర్థించారు అని వెల్లడించారు.
తాను శ్రీను వైట్లను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసాననడంలో నిజం లేదని, శ్రీను వైట్లతో తాను వెంకీ సినిమా నుంచి బాద్ షా వరకు పదేళ్లు పని చేసానని, తనకు ఎక్కువ గుర్తింపు శ్రీను వైట్ల సినిమాల వల్లనే వచ్చిందని, అదే విధంగా తన వల్ల కూడా శ్రీను వైట్ల సినిమాలకు మంచి పేరొచ్చిందని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. మరి మీరు చెబుతున్న ఆ సోకాల్డ్ దర్శకులు ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం కోన వెంకట్ సమాధానం దాట వేసారు. తాను వారి పేర్లు బయట పెట్టబోదలుచుకోలేదని, వాళ్లు ఎవరో ఇండస్ట్ర్రీలో అందరికీ తెలుసన్నారు. శ్రీను వైట్లతో ఇకపై సినిమాలు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు కోన వెంకట్ సమాధానం ఇస్తూ... ఇకపై చేయకపోవచ్చు. ఎందుకంటే నేను ఓక కథ రాసుకుని దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నాను అని సమాధానం ఇచ్చారు కోన వెంకట్. శ్రీను వైట్లతో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications












