ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి: పోలీసులపై కోన వెంకట్ ఫైర్
హైదరాబాద్: బాద్‌షా సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని రాజు మృతి చెందడానికి పోలీసులే కారణమని రచయిత కోన వెంకట్ మండిపడ్డారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న బాద్‌షా సినిమాకు కోన వెంకట్ స్క్రిప్టు రాశారు. పోలీసులు లాఠీచార్జీ చేయడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తన వద్ద ఉందని, కోర్టులో ప్రత్యక్ష సాక్షిగా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు
తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడంపై కోన వెంకట్ తీవ్ర అసంతృప్తికి, నిరాశకు గురైనట్లు కనిపిస్తున్నారు. ట్విట్టర్‌లో వరుసగా ఆ సంఘటనపై తన అభిప్రాయాలు రాస్తూ వెళ్లారు. కొంత మంది పోలీసుల అతి వల్ల జూనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్ మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని, పోలీసుల అహంకారానికి తాను ప్రత్యక్ష సాక్షిని అని ఆయన అన్నారు.
రాజు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు తారక్ ఇంతగా అప్‌సెట్ కావడం తాను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. ప్రమాదంపై దర్శకుడు శ్రీను వైట్ల తీవ్ర విచారానికి గురయ్యారని ఆయన చెప్పారు. సంఘటనకు శ్రీను వైట్ల చలించిపోయారని ఆయన అన్నారు. అత్యంత మెతక మనిషి శ్రీను వైట్ల తీవ్ర ఉద్వేగానికి గురయ్యారని ఆయన అన్నారు.
నిర్వాహకులు 15 వేల మందికి సీట్లు ఏర్పాటు చేశారు. అయితే 25 వేల మంది కార్యక్రమానికి వచ్చారు. నిర్మాత తప్పేమీ లేదని, చాలా మంది కలర్ జిరాక్స్ తీసుకుని కార్యక్రమానికి వచ్చారని, గణేష్ చాలా అప్‌సెట్ అయ్యారని కోన వెంకట్ అన్నారు. బండ్ల గణేష్‌ను సంఘటనకు నిందించలేమని, పోలీసులదే తప్పని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











