ముదిరిన కోన వెంకట్ వివాదం... విమర్శలు
ఆ సమావేశంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.సాగర్. సాగర్ మాట్లాడుతూ.. ''రచయిత కోన వెంకట్ వ్యక్తిగతంగా ఎవరిమీదో పెంచుకొన్న కోపంతో దర్శకులందరి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు. హీరో,హీరోయిన్స్ తో మాట్లాడటం మినహా చేసేదేమీ ఉండదు. ఆయనతో పని చేసిన దర్శకనిర్మాతల్ని అడిగితే ఈ విషయం చెబుతారు. దర్శకుల్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము''అన్నారు.
అలాగే.. ''ఆత్రేయ, జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ తదితర రచయితలకు ఇచ్చిన గౌరవం తనకు ఇవ్వడం లేదని కోన బాధపడుతున్నారు. ఆ రచయితలందరితోనూ నేను పని చేశాను. వాళ్లు కథలు ఇచ్చాక అందులోని ఇతరత్రా విషయాల గురించి మాట్లాడానికి దర్శకనిర్మాతలు వెళ్లేవారు. కథలు ఇవ్వక ముందు మర్యాదలు చేసే సంస్కృతి లేదు అన్నారు.
ఇక... దర్శకుల్లో ఎనభై శాతం మంది సొంతంగా రాసుకొనే సత్తా ఉన్నవాళ్లు ఉన్నారు. సినిమా అనేది సమష్టి కృషి. నలుగురి ఆలోచనలన్నీ సేకరించాక వాటిలో ఏది మంచిదైతే దాన్ని దర్శకుడు సినిమా కోసం వాడుతుంటాడు. 24 విభాగాల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పని చేసే దర్శకుల్ని కించపరుస్తూ మాట్లాడటం సరికాదు. నిజంగా కోన వెంకట్‌లో సత్తా ఉంటే మాధవన్‌తో మొదలుపెట్టిన సినిమా మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? అసలు ఆయన ఫుల్ స్క్రిప్ట్ ఏ సినిమాకి అందించాడో చెప్పాలి. ప్రతి విషయానికీ గోపిమోహన్, నేను అని చెబుతుంటాడు. నీలో ప్రతిభ ఉన్నప్పుడు గోపీ పేరును ప్రస్తావించడం ఎందుకు?'' అని ప్రశ్నించారు.
దర్శకుల సంఘం ప్రధాన కార్యదర్శి మద్దినేని రమేష్ మాట్లాడుతూ ''కోన వెంకట్ ఉపయోగించిన భాష సరిగ్గా లేదు. దర్శకులకు అంత ప్రాముఖ్యత ఎందుకు? అంత పారితోషికాలు ఎందుకు? అని మాట్లాడుతున్నారు. ఒకరి ప్రతిభను శంకించాల్సిన అవసరం ఆయనకు లేదు. దర్శకులపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే సమాధానం చెప్పాల''ని డిమాండ్ చేశారు. ''రచయిత ఆత్రేయ గౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడారు కోన వెంకట్. ఇది వరకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల రచయితల ఇంటికి వెళ్లేవాళ్లు దర్శకనిర్మాతలు. ఇప్పుడు కమ్యూనికేషన్ పెరిగిందనే విషయాన్ని గుర్తించాల''న్నారు దర్శకుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనాథ్. ఈ కార్యక్రమంలో కాదంబరి కిరణ్, అళహరి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications












