హాట్ కేకులా మిర్చి డైరెక్టర్...మరో సినిమాకు సైన్
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘మిర్చి' చిత్రంతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో స్టార్ దర్శకుల లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తన రెండో సినిమా ప్రారంభించిన కొరటాల శివ దీని తర్వాత యూనివర్శల మీడియా బేనర్లో మూడో సినిమాకు సైన్ చేసారు.
ఈ విషయం గురించి కొరటాల శివ వెల్లడిస్తూ...‘మిర్చి సినిమా విడుదల తర్వాత డివివి దానయ్య నన్ను సంప్రదించి సినిమా చేయమని అడిగారు. అయితే అప్పటికే నేను మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బేనర్లో సినిమాకు కమిట్ అయ్యాను. ఈ సినిమా పూర్తయిన వెంటనే డివివి దానయ్యతో నా మూడో సినిమా ప్రారంభిస్తాను. ఈ చిత్రంలో ఓ టాప్ హీరో నటించబోతున్నారు. హీరో ఎవరు అనేది సమయం వచ్చినపుడు చెబుతాను' అని కొరటాల శివ తెలిపారు.
మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం ఈ ఆగస్టు 11న పద్మాలయ స్టూడియోలో గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు లేకుండానే షూటింగ్ మొదలైంది. మహేష్ బాబు లేని సీన్లను సపోర్టింగ్ యార్టర్లతో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' చిత్ర షూటింగులో భాగంగా యూరఫ్ వెళ్లారు. అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత కొరటాల శివ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్నాడు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ ఎంపికయింది. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
సినిమాపై ఇటీవల రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈచిత్రానికి 'కన్నయ్య' అనే టైటిల్ పెడుతున్నారనే వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని...మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం లేదని, అదే విధంగా టైటిల్ కూడా ఖరారు కాలేదని స్పష్టం చేసారు. ఏ విషయమైనా తానే స్వయంగా వెల్లడిస్తానని కొరటాల శివ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











