Acharya : మహేష్ ప్లేస్‌లో రాంచరణ్.. అసలు విషయం బయట పెట్టిన కొరటాల శివ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ శరవేగంగా జరుపుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 23వ తేదీన ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మంగళవారం నాడు మీడియా ప్రతినిధులతో సినిమా యూనిట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విశేషాలను కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, పూజాహెగ్డే పంచుకున్నారు. సినిమాలో ముందు మహేష్ బాబు ని తీసుకోవాలని అనుకున్నారు కదా అంటూ అడిగిన ప్రశ్నకు కొరటాల శివ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళితే

ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ తేజ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. తొలుత ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ కాజల్ అగర్వాల్ పాత్ర చిన్నది అయిపోవడంతో ఆమె పాత్రను పూర్తిగా తొలగించినట్లు కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వాయిదా పడుతూ
ఈ సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సహా అనేక కారణాల వల్ల ఈ సినిమా అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23 వ తేదీన హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు.

ఆలోచన లేదని
తాజాగా ఈ సినిమా యూనిట్ అంతా హైదరాబాద్ లో మీడియాతో సమావేశం అయింది ఈ సమావేశంలో భాగంగా ఒక విలేకరి ప్రశ్నిస్తూ ఈ సినిమాలో తొలుత మహేష్ బాబుని రామ్ చరణ్ పాత్రలో తీసుకోవాలని అనుకున్నారు కదా అని ప్రశ్నించారు. దానికి కొరటాల శివ స్పందిస్తూ అసలు మహేష్ బాబును తీసుకోవాలనే ఆలోచన తనకు లేదని ఆలోచన మీకు పుట్టింది కానీ తమకు లేదని చెప్పుకొచ్చారు..

బ్రేక్ పడినట్లే
అంతేగాక రామ్ చరణ్ పాత్ర ముందు చిన్నగా అనుకున్నారని తర్వాత పాత్ర పరిధిని పెంచారని కూడా ప్రచారం జరిగింది కదా అని సదరు విలేకరి ప్రశ్నించగా రామ్ చరణ్ పాత్ర తొలుత ఎంత అనుకున్నామో ఇప్పుడు కూడా అంతే ఉందని అందులో తగ్గించింది కానీ పెంచింది కానీ ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ క్లారిటీతో సినిమా ప్రారంభమైనప్పటినుంచి జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లే.

అందుకేనేమో
అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో కొరటాల శివ రెండు సినిమాలు చేశారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసి సూపర్ హిట్ లు కొట్టడమే కాక మహేష్ బాబు తో మంచి సాన్నిహిత్యం కూడా పెంచుకున్నాడు. బహుశా ఇదే కారణం వల్ల ఆయన ఆచార్యలో మహేష్ బాబుని నటింప చేస్తున్నారని ప్రచారం జరిగి ఉండవచ్చు.


Click it and Unblock the Notifications











