ప్రభాస్‌పై రూమర్, చెప్పుతో కొట్టాలన్న కృష్ణం రాజు
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇటీవల షాకింగ్ రూమర్ల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి షూటింగులో గాయపడ్డ ప్రభాస్ కొమాలోకి వెళ్లారనే కొన్నివదంతులు వ్యాపించాయి. అయితే ఈ వదంతులపై ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు.
అభిమానుల సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కృష్ణం రాజు....ప్రభాస్‌పై ఇలాంటి వదంతులు సృష్టిస్తున్న వారిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి వదంతులను దిష్టిచుక్కగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి షూటింగులో పాల్గొంటున్నాడని, ఇలాంటి పుకార్లను అభిమానులు నమ్మొద్దని సూచించారు.
బాహుబలి సినిమా వివరాల్లోకి వెళితే....ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












