‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఆడియో అక్టోబర్ 3న
హైదరాబాద్: దగ్గుబాటి రాణా, నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఖరారైంది. అక్టోబర్ 3న ఆడియో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈచిత్రం ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ చిత్రం ద్వారా రానా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.
గమ్యం, వేదం లాంటి చిత్రాల దర్శకుడు క్రిష్, హాట్ బ్యూటీ నయనతార హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటి వరకు రాణా కెరీర్ లో ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా లేదనే చెప్పాలి. భిన్నమైన సినిమాలకు కేరాప్ అడ్రస్ గామారిన క్రిష్ కూడా....ఇప్పటి వరకు యాక్షన్ నేపథ్యాన్ని ఎంచుకోలేదు. తాజాగా 'కృష్ణం వందే జగద్దురుమ్" సినిమా యాక్షన్ అంశాలతో విభిన్నంగా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో రాణా పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నపాత్రలో కనిపిస్తాడు.
నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి, దర్శకత్వం: క్రిష్.


Click it and Unblock the Notifications











